ఖమ్మం: కుటుంబ కలహాల నేపథ్యంలో కని, పెంచిన ఇద్దరు కుమారులను ఎలుకల మందు ద్వారా బలి తీసుకున్న ఓ తల్లి ఉదంతం ఖమ్మం నగరంలో తీవ్ర కలకలం రేపింది. నగరంలోని త్రీ టౌన్ ప్రాంతంలో గల గాంధీ నగర్ లో జరిగిన ఈ విషాద ఘటన పలువురు మాతృ మూర్తుల కంట కన్నీరు తెప్పించింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాల్లోకి వెడితే.. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడుకు చెందిన గోపాల లింగరాజు, స్వాతి దంపతులకు వేదిక్ కుమార్ (7), తనిష్క్(5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ దంపతులు ఖమ్మం నగరంలోని గాంధీనగర్ రెండేళ్లుగా ఉంటున్నారు. తిరిగి గుర్రాలపాడుకు నివాసం మార్చాలనే అంశంపై వీరిద్దరి మధ్య కలహాలు ఏర్పడ్డాయి. ఈ అంశంలో పెద్దలు కూడా ఇరువురికీ సర్దిచెప్పి తిరిగి గుర్రాలపాడు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు స్వాతి నిరాకరించిన పరిణామాల్లో కలహాలు మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లోనే స్వాతి తన ఇద్దరు పిల్లలు వేదిక్ కుమార్, తనిష్క్ లకు కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి తాగించడంతోపాటు తాను కూడా తాగింది. దీంతో ఇద్దరు చిన్నారులు వేదిక్ కుమార్, తనిష్క్ లు ప్రాణాలు కోల్పోగా, తల్లి స్వాతి ప్రాణాపాయ స్థితిలో ఉండగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
