హైదరాబాద్: తెలంగాణా ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ జర్పుల మోహన్ నాయక్ ను అరెస్ట్ చేయనున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఆయన అక్రమాస్తులను ఏసీబీ అధికారులు వెలికి తీశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే అభియోగాలపై మోహన్ నాయక్ పై నమోదైన కేసులో ఏసీబీ మంగళవారం ఆయన నివాసాల్లో తనిఖీలు నిర్వహించింది. అవినీతి చర్యలకు పాల్పడడం ద్వారా మోహన్ నాయక్ భారీ ఎత్తున ఆస్తులు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కూడబెట్టినట్లు ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది.

ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. మోహన్ నాయక్ ఆఫీసులోనేగాక, అతని ఇంట్లో, బంధువులు, బినామీలు, అనుబంధ వ్యక్తులకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. తద్వారా విలువైన అస్తుల డాక్యుమెంట్లను, బంగారు ఆభరణాలను, నగదు నిల్వలను కనుగొన్నారు. వీటి విలువ రూ. 17.94 కోట్లుగా ఏసీబీ ప్రకటించింది.

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ముల్లంగి గ్రామంలో రూ. 82.89 లక్షల విలువైన 19.38 ఎకరాల భూములు, కూకట్ పల్లిలో మూడు, గచ్చిబౌలిలో నాలుగు కలిపి రూ. 7.34 కోట్ల విలువైన మొత్తం ఏడు ఫ్లాట్లను గుర్తించారు. అదేవిధంగా మియాపూర్ లో రూ. 2.50 కోట్ల విలువైన విల్లాను, కూకట్ పల్లిలో రూ. 62.14 లక్షల విలువైన కొత్తగా నిర్మించిన ఇంటిని కలిగి ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో తేలింది. ఇవిగాక నిజామాబాద్ లో కొత్తగా నిర్మిస్తున్న ఓ విల్లాకోసం రూ. 1.00 కోటి మొత్తాన్ని అడ్వాన్సుగా చెల్లించి ఓ విల్లాను కొనుగోలు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. బహిరంగ మార్కెట్ లో ఈ ఆస్తుల విలువ భారీ ఎత్తున ఉంటుందని పేర్కొంది.

అదేవిధంగా రూ. 55.00 లక్షల నగదును, రూ. 1.44 కోట్ల బ్యాంకు బ్యాలెన్సులను, రూ. 2.00 కోట్ల విలువైన 2,500 గ్రా. (రెండున్నర కిలోలు) బంగారు ఆభరణాలను, రూ. 3.60 లక్షల విలువైన ఆరు కిలోల వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రూ. 1.26 కోట్ల విలువైన గృహోపయోగ వస్తువులను, రూ. 11.25 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను, 9 మొబైల్ ఫోన్లను, నాలుగు లాప్ టాప్ లను, రూ. 25.00 లక్షల విలువైన వాహనాలను కనుగొన్నారు.

ఆక్రమాస్తుల కేసులో నిందితుడైన ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ను అరెస్ట్ చేయనున్నట్లు ఏసీబీ ప్రకటించింది. రిమాండ్ కోసం కోర్టులో హాజరుపరుస్తామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. మొత్తం ఘటనకు సంబంధించి ఏసీబీ విడుదల చేసిన పూర్తి ప్రకటనను దిగువన చూడవచ్చు.

