Top 5 This Week

Related Posts

రైలులో దొంగలు.. వరంగల్ నుంచి ఫోన్.. ఖమ్మంలో అరెస్ట్

ఖమ్మం: వరంగల్ మహానగరంలోని చోరీకి పాల్పడిన దొంగలు ఆ తర్వాత ఓ లాడ్జికి వెళ్లారు. రిఫ్రెష్ తర్వాత చొక్కాలు మార్చుకుని ఎంచక్కా రైలెక్కారు.. చోరీ ఘటనపై సీసీ ఫుటేజీని పరిశీలించిన వరంగల్ పోలీసులు దొంగలు రైలు ఎక్కి ఖమ్మం వైపు ప్రయాణిస్తున్నట్లు గమనించారు. వెంటనే మహబూబాబాద్ పోలీసులను అలెర్ట్ చేశారు. రైలు మహబూబాబాద్ కు రాగానే అక్కడి పోలీసులు తనిఖీ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇదే విషయాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు సమాచారం అందించారు. ఆయన వెంటనే సీసీఎస్ పోలీసులను అప్రమత్తం చేశారు.

సీపీ ఆదేశంతో ఖమ్మం నగరంలో సీసీఎస్ పోలీసులు మూడు టీంలుగా రైల్వే స్టేషన్ కు బయలుదేరారు. దొంగలు ఎక్కినట్లు భావిస్తున్న రైలు ఖమ్మం రాగానే సీసీఎస్ పోలీసులు కూడా అదే రైలులోకి సామాన్య ప్రయాణీకుల్లా ప్రవేశించారు. అస్పష్టమైన సీసీ టీవీ ఫుటేజీ తప్ప స్పష్టమైన ఫొటోలు లేకపోయినా పోలీసులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తం ఇరవై బోగీల్లో ప్రయాణిస్తున్నవారిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వెతికారు. ఎట్టకేలకు కదులుతున్న రైలులో దొంగలను గుర్తించి మధిరలో పట్టుకున్నారు.

వరంగల్ సీపీ పంపిన ప్రశంసా పత్రాలను ఖమ్మం సీపీ సునీల్ దత్ సీసీఎస్ పోలీసులకు అందించిన దృశ్యం, చిత్రంలో అదనపు డీసీపీ రామానుజం, సీసీఎస్ ఏసీపీ సర్వర్ కూడా ఉన్నారు.

పందొమ్మిదో బోగీలో గల వెస్ట్ బెంగాల్ కు చెందిన షేక్ ఫిరోజ్, షేక్ ఎమిన్, షేక్ సుఖ్ చంద్ అనే ముగ్గురు దొంగలను చాకచక్యంగా పట్టుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఈ చోరీ ఘటనలో దొంగల నుంచి బంగారాన్ని, నగదును కూడా పోలీసులు రికవరీ చేశారు. బెంగాల్ దొంగల ముఠా గురించి సమాచారం ఇచ్చిందే తడవుగా తక్షణమే స్పందించి, వారిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులను వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనర్లు ఈ సందర్భంగా ప్రశంసించారు.

ఈమేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ పంపించిన ప్రశంసా పత్రాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సీసీఎస్ సిబ్బందికి అందించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రామానుజం, సీసీఎస్ ఏసీపీ సర్వర్ పాల్గొన్నారు.

Popular Articles