Top 5 This Week

Related Posts

సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ అరెస్ట్

హైదరాబాద్: హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న బత్తుల మహేందర్ ను ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. సైబర్ నేరాలకు పాల్పడిన వ్యక్తి నుంచి ఈ ఇన్స్పెక్టర్ లంచాన్ని స్వీకరించడమే ఘటనలో గమనించాల్సిన అంశం. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ జారీ చేసిన వివరాల్లోకి వెడితే..

సైబర్ నేరాల ఛీటింగ్ వ్యవహారంలో నమోదైన ఓ కేసులో కుటుంబ సభ్యుల, స్నేహితుల పేర్లను ఇరికించకుండా అధికారికంగా లబ్ధి చేకూర్చేందుకు బాధిత ఫిర్యాదుదారుని నుంచి ఇన్స్పెక్టర్ మహేందర్ రూ. 9.00 లక్షల మొత్తాన్ని డిమాండ్ చేశాడు. ఇందులో రూ. 5.00 లక్షల మొత్తాన్ని బాధితుడు ఇప్పటికే చెల్లించగా, మిగతా రూ. 4.00 లక్షల మొత్తం కోసం మహేందర్ ఒత్తిడికి, బెదిరింపులకు చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, ఆయా మొత్తాన్ని తీసుకుంటూ ఇన్స్పెక్టర్ మహేందర్ ఏసీబీకి చిక్కాడు.

ఈ ఘటనానంతరం ఏసీబీ అధికారులు మహేందర్ నివాసంలో తనిఖీలు జరపగా, లెక్కల్లో లేని రూ. 13.00 లక్షల నగదుతోపాటు బంగారు ఆభరణాలను, కొన్ని ఆస్తుల డాక్యమెంట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ మహేందర్ ఆస్తులకు సంబంధించి తదుపరి పరిశీలన కూడా జరుగుతోంది. ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ మహేందర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

Popular Articles