Top 5 This Week

Related Posts

కరీంనగర్ ‘రణరంగం’.. అసలేం జరిగింది!?

కరీంనగర్: వేడెక్కిన రాజకీయాలతో కరీంనగరం గురువారం రణరంగంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రోడ్డెక్కాయి. పరస్పర ఆందోళనకు దిగాయి. పరిస్థితి దాడులకు దారి తీసింది. కేటీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు, బండి సంజయ్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య ‘యుద్ధ’ వాతావరణానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలకు వేదికైన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసుపైనా బీజేపీ శ్రేణులు దాడి చేసి విధ్వసం సృష్టించాయి. ఓ నగల షాపులో దుండగులు జరిపిన కాల్పులే ఈ రాజకీయ వేడికి దారి తీసిందనే వ్యాఖ్యలు ఈ సందర్బంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది..? దాడులకు దారి తీసిన పరిస్థితులు, పరిణామాలేమిటి..? ఓసారి సమీక్షిద్దాం..

కేటీఆర్

కరీంనగర్ లోని పీఎంజే జువెల్లరీ షాపులో ఇటీవల దొంగలు చొరబడి భారీ చోరీకి పాల్పడడంతో పాటు కాల్పులు జరిపిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఈ పరిణామమే కరీంనగర్ రాజకీయాల్లో దుమారానికి హేతువైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం సమీపంలోనే జరిగిన ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగానే స్పందించింది. పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం వల్లే దొంగలు ఆయుధాలతో సంచరిస్తూ భారీ చోరీకి పాల్పడారని కేటిఆర్ తోపాటు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి శవాలు.. శివాలు తప్ప ఏమీ తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో కాందీశీయుల భూముల, ఎవాక్యూ ప్రాపర్టీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న ‘సంబంధం’తోనే బండి సంజయ్ ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని గులాబీ పార్టీ లీడర్లు ఆరోపించారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగానే స్పందించారు. కేటీఆర్ ను ఉద్దేశించి, ‘నువ్వు మనిషివేనా, జంతువు, చీమకంటే హీనమైన బతుకు నీది’ అని వ్యాఖ్యానించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే 48 గంటల్లో బయటపెట్టాలని, లేకుంటే కరీంనగర్ లో అడుగు పెట్టనివ్వబోమని సంజయ్ హెచ్చరించారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురువారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన చిత్రం

అయితే బండి సంజయ్ వ్యాఖ్యలపై ఈసారి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రంగంలోకి దిగి స్పందించడం గమనార్హం. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, సంజయ్ సబ్జెక్టు నాలెడ్జ్ లేని వ్యక్తి అని, అబ్బెబ్బె.. బెబ్బెబ్బే అనడం కాదని, ఏ సబ్జెక్టుపైన అయినా చర్చించేందుకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ పై డ్రగ్స్ ఆరోపణలు చేయడం కాదని, సంజయ్, నువ్వు తంబాకులో డ్రగ్స్ కలుపుకుని తినడం వల్లే జుట్టు ఊడిపోయి గుండు అయిందని తాము కూడా మాట్లాడగలమని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.

దీంతో బీజేపీ శ్రేణులు గురువారం రంగంలోకి దిగారు. సంజయ్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాషాప పార్టీ కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకుని దాడికి పాల్పడ్డారు. కర్రలు రాళ్లతో కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. చేతికి అందిన వస్తువులతో ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీసుపౌ దాడి చేసి బీభత్సం సృష్టించారు. అనూహ్య పరిణామాలతో, ఓ దశలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భయాందోళన చెందుతూ గన్ మెన్ల రక్షణలో గదిలో గంటపాటు ఉండిపోయారు.

కౌశిక్ రెడ్డి కారును ధ్వసం చేస్తున్న బీజేపీ శ్రేణులు

అనూహ్యంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసులు రంగప్రవేశం చేశారు. బీజేపీ కార్యకర్తల విధ్వంసంతో పోలీసులు తమ లాఠీలకు పని కల్పించారు. బీజేపీ కేడర్ ను చెదరగొట్టారు. ఈ సందర్భంగా పలువురిని అరెస్టు చేశారు. అయితే బీజేపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ బండి సంజయ్ కార్యాలయంపై దాడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు‌. ఇరుపార్టీల కార్యకర్తల పరస్పర దాడులు, పోలీసుల లాఠీచార్జితో పలువురు గాయపడ్డారు.

బీజేపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన కౌశిక్ రెడ్డి కారు

ఆతర్వాత దాడి, విధ్వంసం, ఉద్రిక్త పరిస్థితులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలే కారణమని భావిస్తూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని హుజరాబాదుకు తరలించారు. అరెస్టును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు వారిని నిలువరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు హుజురాబాద్ లో కూడా బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు.

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసులో విధ్వంసపు ఆనవాళ్లు

బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో హుజురాబాద్ కు చేరుకుని బీజేపీ పైకి దాడికి యత్నించారు. పరస్పరం నినాదాలు కర్రలతో ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలించారు. కాగా సంజయ్ తోపాటు కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే బీజేపీ కేడర్ దాడికి పరోక్షంగా పోలీసులు సహకరించారని గులాబీ పార్టీ శ్రేణులు ఆరోపించాయి. దాడి, విధ్వంసాన్ని నిరసిస్తూ ఈనెల 9న కరీంనగర్ బంద్ కు పిలుపునివ్వడం గమనార్హం.

Popular Articles