Top 5 This Week

Related Posts

గడువు పెంచండి ‘సర్’: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఢిల్లీ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గడువు పెంచాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈమేరకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఈ సందర్బంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో జరుగుతున్న జాప్యం, తలెత్తుతున్న ఇబ్బందులను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి బీఆర్ఎస్ నాయకుల టీం తీసుకెళ్లింది.

రాష్ట్రవ్యాప్తంగా డూప్లికేట్ ఓటర్ల అంశంపై తమ పార్టీ అధ్యయనం నిర్వహించిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో డూప్లికేట్ ఓటర్లను, ఒక జిల్లాలో అత్యల్పంగా 464 డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ వివరాలన్నింటినీ ఎన్నికల సంఘానికి నివేదిక రూపంలో సమర్పించినట్లు ఆయా నాయకులు వెల్లడించారు.

‘ఎస్ఐఆర్’ గడువు పెంచాలని ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతి పత్రాన్ని చూపుతున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, చిత్రంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్,సోమ భరత్

డూప్లికేట్ ఓటర్ల సమస్య ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించింది కాదన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీ అయినా దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున ఓటరు జాబితాలను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ప్రతినిధి బృందం పేర్కొంది. ప్రతి భారత పౌరుడికి ఒకే చోట ఓటు ఉండేలా చర్యలు తీసుకోవడం, డూప్లికేట్ నమోదులను తొలగించడం ద్వారా ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు.

కాగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ చట్టబద్ధంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా పూర్తయ్యేలా తమ పార్టీ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ఎన్నికల సంఘానికి హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ బృందం వివరించింది.

Popular Articles