పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా మనం కొందరు పొలిటీషియన్స్ గురించి చర్చించుకోవలసి ఉంటుంది. కిందపడి, మీదపడి, గట్టిగా మాట్లాడి, మాట మార్చి, మొండిగా ముందుకుపోయి, ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ ప్రజాభిమానం కూడగట్టిన రాజకీయ ఉద్ధండులు అనేక మంది. అలాంటి వారిలో మమతా బెనర్జీ అగ్రగణ్యులని చెప్పక తప్పదు. కేసీఆర్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ తదితరుల జాబితాలో మమతా బెనర్జీకి ప్రముఖ స్థానం ఉంది.
పాతికేళ్లు కాంగ్రెస్ లో ఉండి కామ్రేడ్స్ చేతిలో చావబోయి బతికిన ఆమె పార్టీ నాయకత్వంతో పడక సొంతగా 1998లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఏర్పాటుచేసి సత్తా చాటిన మహిళా నేతగా పేరుగాంచారు. పోరాడి, పోరాడి… 34 ఏళ్ల లెఫ్ట్ పాలనకు చరమగీతం పాడిన ఆమె 2011 లో మొదటిసారి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రోగ్రెసివ్ రాష్ట్రమైన బెంగాల్ కు ఆమె మొదటి మహిళా ముఖ్యమంత్రి. ఆ తర్వాత 2016, 2021 ఎన్నికల్లో కూడా ఆమె సీఎం అయ్యారు. ఇది అసాధారణమైన హ్యాట్రిక్.
కరడుగట్టిన కమ్యూనిస్టుల ప్రభావానికి మమత తరహాలో గట్టి గండి కొట్టిన నాయకురాలు ఎవ్వరూ లేరు. ఇది అంత తేలికైన విషయం కాదు. బీజేపీకి కొరకరాని కొయ్యగా మారి, మోదీ – అమిత్ షా ద్వయానికి కంట్లో నలుసుగా మారారు ఆమె. కాంగ్రెస్ నాయకత్వం ఇంకొద్దిగా గట్టిగా డైనమిక్ గా ఉంటే గత ఎన్నికల్లో ఫలితాలు వేరేగా ఉండేవి.
తుది దశ పోలింగ్ ఈ రోజు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ లో మరోసారి మమత జయకేతనం ఎగురవేస్తారా? లేదా? అనే చర్చ దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చి బెంగాల్ లో పాగా వేయడం కోసం ఆర్ఎస్ఎస్ దాదాపు రెండేళ్ల కిందటే గ్రౌండ్ లెవెల్ వర్క్ మొదలు పెట్టింది. దశాబ్ధం క్రితం.. అంటే 2016లో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే గల బీజేపీ క్రమక్రమంగా ఎదుగుతూ 2021లో 77 శాసన సభా స్థానాలను సాధించింది. ఈ సారి ఎలాగైనా అధికార పీఠం చేపట్టాలని దీర్ఘకాల, స్వల్పకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. మోదీ – షా ప్రత్యేక ఫోకస్ తో ఉన్నారు.
అయితే, కాషాయ వ్యతిరేక కూటమిలో ముఖ్యమైన టీఎంసీ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గూండా రాజ్ ఆరోపణలు చేసి బీజేపీ వాదనకు బలం చేకూర్చారు. మోదీ, మమత దొందూ దొందేనని ఆయన విమర్శలు గుప్పించారు. దాన్ని ఓటర్లు ఎలా స్వీకరిస్తారో, అది ఎవరికి మేలు చేస్తుందో చూడాలి.
మమత పార్టీ గుండాల నుంచి రక్షణ కావాలంటే బీజేపీ ఒక్కటే దిక్కు అన్నట్లుగా నేతల ప్రచారం సాగింది. శాంతి భద్రతల సమస్య, అభివృద్ధి లేమి వంటివి బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాస్త్రాలు అయ్యాయి.
ఓటర్ల జాబితా సవరణ చేసి దాదాపు కోటి మంది ఓట్లు తొలగించడం మీద వాడివేడి చర్చ జరిగింది. యూపీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్ అధికారి వచ్చి బెంగాల్ లో ధమ్కీ ఇవ్వడం, ఫలితాలు వచ్చాక మీ అయ్య ఎవడు ఢిల్లీ నుంచి వచ్చి రక్షిస్తాడో చూస్తానని మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బాహాటంగా బెదిరించడం చూశాం. రెండు నెలల పాటు భద్రతా దళాలు బెంగాల్ లో ఉండి రక్షిస్తాయని, భయం లేకుండా ఓటు వేయాలని కేంద్ర నాయకులు భరోసా ఇస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ లో బెంగాల్ నాడి తెలిసే అవకాశం ఉంది ఈ సాయంత్రం… ఓడితే SIR, EVMలను టీఎంసీ బ్లేమ్ చేస్తుంది. గెలిచినా, ఓడినా 71 ఏళ్ల దీదీ దేశ రాజకీయాల్లో ఒక అధ్యాయమేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

✍️ డా. ఎస్. రాము
సీనియర్ జర్నలిస్ట్

