ఎన్కౌంటర్ అనగానే మనకు గుర్తొచ్చేది పోలీసులు, నక్సలైట్లు, తుపాకులు, బుల్లెట్లు మాత్రమే. కానీ ‘ఎన్కౌంటర్’ అనే పదానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.. ఎదురుపడడం, తారసపడడం, కలవడం, ఎదుర్కోవడం, అనుకోకుండా కలవడం వంటి అనేక పర్యాయ పదాలు కూడా ‘ఎన్కౌంటర్’ ఘటనగానే వ్యవహరిస్తారు. రామ్ నాథ్ గోయెంకా ఆంధ్రప్రభ పత్రికలో 1995-96 లో డిప్యూటీ ఎడిటర్ గా పనిచేసిన టంకశాల అశోక్ అనే సీనియర్ జర్నలిస్ట్ ‘ఎన్కౌంటర్’ పదానికి అచ్చ తెలుగులో ‘సాయుధ ఘర్షణ’ అనే పదాన్ని వాడాలని ‘గెజిట్’ తరహా ఆదేశాలను ఆ పత్రికలో పనిచేసే జర్నలిస్టులకు జారీ చేశారు. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగే ఎన్కౌంటర్ల ఘటనల వార్తలకు ‘సాయుధ ఘర్షణలో..’ అనే పదాలతో హెడింగ్ ఉండేదన్నమాట. ‘ఎన్కౌంటర్’ పద సందర్భం ఇప్పుడు దేనికంటే.. సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ ఎడిటర్ తోట భావనారాయణ రాసిన మూడు దృశ్యాల కథనానికి ‘ఎన్కౌంటర్లు’ అనే పదాన్ని వాడడంలో ఔచిత్యమేమిటో ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది. ఇక చదవండి..
సీన్ నెం. 1
అప్పుట్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులనాటి సంగతి. ఆ రోజు ఒక ప్రోగ్రామ్ కి సంబంధించిన ఫోటో ప్రెస్ వాళ్ళకు అందాల్సి ఉంది. జయలలిత ఉన్న ఏ ఫోటో అయినా ముందుగా ఆమె అప్రూవ్ చెయ్యాలి. ఆమె అప్రూవ్ చేసిన ఫోటోలు మాత్రమే ప్రింట్స్ వేసి సెక్రెటేరియట్ ప్రెస్ రూమ్ లో ఉన్న పత్రికలవాళ్ళకి ఇస్తారు. సమాచారశాఖ డైరెక్టర్ సుబాష్ ఇంకా రాలేదేంటా.. అనుకుంటూ అటువైపు వెళుతుంటే జయలలిత ఆఫీస్ బయట చాలామంది విజిటర్స్ ఉన్నారు. వాళ్ళలో వెంపటి చినసత్యం గారు కనబడ్డారు.
కూచిపూడి నాట్యగురువుగా పేరుండటమే కాదు.. హేమమాలిని, వైజయంతిమాల, జయలలిత, ప్రభ, శోభానాయుడు లాంటి ఎంతోమంది ఆయనకు శిష్యురాళ్ళు. చాలా సినిమాలకు ఆయన కోరియోగ్రాఫర్ కూడా. నేను ఆయనకు తెలియకపోయినా .. దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకొని ఆయన వచ్చిన సంగతి అడిగితే జయలలితను కలవటానికి వచ్చానన్నారు. అప్పుడే అటువైపు వచ్చిన సుభాష్ ను పక్కకు పిలిచి .. వెంపటి చిన సత్యం గారు జయలలితగారికి గురువని, చాలా ముఖ్యమైనవారని నేను కాస్త హడావిడి చేస్తూ చెప్పగానే కంగారు పడి వెంటనే ఒక స్లిప్పు రాసి లోపల ఇవ్వటమే కాదు, మరుక్షణమే ఆయన్ను లోపలికి తీసుకెళ్ళాడు.

నేను ప్రెస్ రూమ్ కు తిరిగొచ్చి ఫోటోల కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఇరవై నిమిషాలు గడిచేసరికి చిన సత్యంగారిని వెంటబెట్టుకొని సుబాష్ రానే వచ్చాడు. “మీరు ఆయన గురించి నాకు చెప్పటం మంచిదయింది. లేకపోతే పట్టించుకునేవాణ్ణి కాదు. తరువాత నాకు తిట్లు తప్పేవి కాదు. సీఎం గారు కుర్చీలోంచి లేచి మరీ ఆయన్ను రిసీవ్ చేసుకున్నారు” అంటూ, ఆ రోజు ఇవ్వాల్సిన ఫోటోలున్న కవర్ నా చేతిలో పెట్టాడు. “సార్ మిమ్మల్ని కలిసి వెళతానంటే ఇక్కడికి తీసుకొచ్చా” అన్నాడు.
చిన సత్యంగారు నాకు పదే పదే థాంక్స్ చెబుతూ.. జయలలితగారిని ఎలా కలవాలో కూడా తెలుసుకోకుండానే వచ్చానన్నారు. తీరా లోపలికి వెళ్ళగానే ఆమె కుర్చీలోనుంచి లేచి రండి మాస్టర్ గారూ అని పిలిచి కూర్చోబెట్టారట. “ఏమైనా పనిమీద వచ్చారా?” అని అడిగితే “గ్రీన్ వేస్ లో కూచిపూడి ఆర్ట్ అకాడెమీ కోసం ఎమ్జీఆర్ హయాంలో లీజుకిచ్చిన భూమి గడువు పూర్తవుతున్నదని, దాని లీజు పొడిగించమని దరఖాస్తు చేసుకున్నా”నని చెప్పారట. వెంటనే ఆ ఫైల్ తీసుకురమ్మని సెక్రెటరీకి చెప్పి కాఫీ తెప్పించారట. మాటల మధ్యలో ఆమె “మాస్టారూ, మీకు ‘కలైమామణి’ వచ్చిందా?” అని అడిగితే ఆయన రాలేదని చెప్పారట. తమిళనాడు ప్రభుత్వం కళారంగంలో ప్రముఖులకిచ్చే ప్రతిష్ఠాత్మక పురస్కారం అది.

అప్పటికే ఆమె టేబుల్ మీద ఆ జాబితా అప్రూవల్ కోసం సిద్ధంగా ఉంది. అది తీసుకొని అందులో ఆమె స్వయంగా ఆయన పేరు రాశారట. ఇంతలో ఆయన దరఖాస్తు ఫైల్ వచ్చింది. అది చూసి ఆమె లీజు పొడిగింపు కాకుండా, ఆ నాలుగెకరాలభూమి రెగ్యులరైజ్ చేయవలసిందిగా ఫైల్లో రాస్తూ, వారంలోగా ఆర్డర్స్ ఆయన ఇంట్లో ఇచ్చి రావాలని ఆదేశించారట. ఇందులో నా ప్రమేయమేమీ లేకపోయినా, కాసేపట్లో అలా ఆయన పని పూర్తి కావటం నాకూ చాలా సంతోషమనిపించింది.
సీన్ నెం. 2:
ఆర్టికల్ రాస్తా.. కానీ ఎంతిస్తారు?
అదేవిధంగా చెన్నై ‘వార్త’లో ఉండగా ఒక రోజు మా స్పోర్ట్స్ ఇన్ చార్జ్ జెస్సీ (జె. శ్రీనివాస్) హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు. క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేత ఒక కాలమ్ రాయించాలని, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ విషయం మాట్లాడాలని చెప్పారు. “ఎంత ఇస్తారని అడిగితే ఏం చెప్పాలి?” అనడిగితే ఐదు వేలు.. అని చెప్పమన్నారు. సరేనని ఆయన ఆఫీస్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే వాళ్ళ సెక్రెటరీ మాట్లాడింది. ఒక గంటలో రాగలరా..? అని అడిగితే సరేనన్నా. అసలే వేసవి, మిట్టమధ్యాహ్నం… సిటీ శివార్లలో నీలంకరైలో అనుకుంటా ఆయన ఆఫీస్. రెండు బస్సులు మారుతూ చెమటలు కక్కుకుంటూ మధ్యాహ్నం 2 కల్లా వెళ్ళా. బాగా రిసీవ్ చేసుకున్నారు. అంత వేసవి ఎండలోనూ వేడి వేడి కాఫీ తాగక తప్పలేదు. నేరుగా సబ్జెక్ట్ లోకి వస్తూ, “చెప్పండి.. కాలమ్ రాయాలని అడిగారట” అన్నారు.
మామూలుగా తెలుగు పేపర్ అంటే ఇంటరెస్ట్ చూపించరేమోనని సెకండ్ లార్జెస్ట్ తెలుగు డైలీ లాంటి మాటలు చెబుతూ, ఎంతైనా తమిళుడు కదా అని కాసిని మంచి మార్కులు కొట్టేసే ఉద్దేశంతో తమిళం, ఇంగ్లిష్ మిక్స్ చేసి పేపర్ గొప్పదనం, అందులో స్పోర్ట్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఊదరగొట్టా. నా మాటలు ఎప్పుడు పూర్తవుతాయా..? అని ఎదురుచూస్తున్న శ్రీకాంత్ తన పిల్లిగడ్డం తడుముకుంటూ, “ఎంతిస్తారు?” అనడిగారు. నా ఉపోద్ఘాతం ఆయనకు అవసరం లేదని అర్థమైంది. “ఐదు వేలు” అని చెప్పా. “పది వేలయితే రాస్తా” అన్నారు బేరానికి అవకాశం లేదన్న సంకేతమిస్తూ.

అప్పటిదాకా వార్త గొప్పదనం చెప్పినవాణ్ణి ఇప్పుడు మాట మార్చాల్సి వచ్చింది. ప్రాంతీయ పత్రిక అని, స్పోర్ట్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు కాబట్టి మావాళ్ళు 5 వేలకు రెడీ అయ్యారని చెప్పా. “నాకు ఏ పత్రికైనా ఒకటే. ఇంగ్లీష్ లో నేరుగా వేసుకుంటారు. మిగతావాళ్ళు ట్రాన్స్ లేట్ చేసుకుంటారు. నా పనిలో మార్పుండదుగా” అంటూ లాజిక్ విడమరచి చెప్పారు. మా ఆఫీస్ లో అడిగి మళ్ళీ వస్తానని లేవబోతుంటే లాండ్ లైన్ ఫోన్ నా ముందుకు తోస్తూ, “మాట్లాడండి” అన్నారు. బిజినెస్ అప్పటికప్పుడు తేలిపోవాల్సిందే అన్న ధోరణి ఆయన ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడింది.
ఏబీకే గారికి డయల్ చేశా.. ఆయన తీయలేదు. జెస్సీకి చేస్తే “మనం అంత ఇచ్చుకోలేం.. ఐదువేలే మనకు చాలా ఎక్కువ” అన్నారు. అదే విషయం సాధ్యమైనంత వినయంగా చెప్పా. ఒక చిన్నపాటి చిరునవ్వుతో చేయి ముందుకు చాచారు షేక్ హాండ్ ఇవ్వటానికి. ఇక తమరు బయలుదేరవచ్చు అంటున్నట్టు నాకనిపించింది. అలా షేక్ హాండ్ తో సెలవుతీసుకొని బయటికొచ్చేశా.
సీన్ నెం. 3
ఆమె జాకెట్టు అంటూ.. ఏడు పదుల వయస్సులో ప్రేమ కవిత్వం:
మద్రాసు అమెరికన్ కాన్సులేట్ లో తెలుగు విభాగాధిపతిగా పనిచేసిన బీస్సార్ కృష్ణ గారి గురించి తెలియని మద్రాసు తెలుగు వాళ్ళుండరు. గుంటూరు ఏసీ కాలేజ్ లో ఎన్టీయార్ క్లాస్ మేట్. ఆయన నెలనెలా ఒక సాహిత్య కార్యక్రమం నడుపుతూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళేసరికి ఒక పెద్దాయన ఆయనతో కబుర్లు చెబుతూ ఉన్నారు. జాగ్రత్తగా గమనిస్తే ఆయన బెజవాడ గోపాలరెడ్డి గారని అర్థమైంది. కృష్ణ గారు నన్ను పరిచయం చేశారు. నమస్కారం పెట్టి కూర్చున్నా.
ఆంధ్ర రాష్ట్రానికి రెండవ/చివరి ముఖ్యం మంత్రిగా, కేంద్ర మాజీ మంత్రిగా, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ గా ఆయన గురించి తెలుసు. ఆయన. స్వాతంత్య్ర సమరయోధుడని, శాంతినికేతన్ లో చదువుకున్నారని, దాదాపు పది భాషలు వచ్చునని, బెంగాలీ నుంచి అనేక రచనలు తెలుగులోకి అనువదించారని, జ్ఞానపీఠ పురస్కార కమిటీ ఛైర్మన్ గా పనిచేశారని కూడా విన్నాను. కానీ, ఒక రాజకీయ నాయకుడికి సాహిత్యంతో అంతగా సంబంధం ఉండటం విశేషమే.

“ఏమయ్యా.. నా కవిత్వ పఠన కార్యక్రమం పెట్టమంటే కృష్ణ నవ్వుతాడేంటీ?” అన్నారు ఫిర్యాదు చేస్తున్నట్టు నాతో. ఆయన కవిత్వం రాశారని నాకు తెలియదు. అందుకే నేనేం మాట్లాడలేదు. అప్పుడు కృష్ణ గారు, “70 ఏళ్ల వయసులో ప్రేమ కవిత్వం రాసి, ఇంకో పుష్కరం గడిచాక ఇప్పుడది చదువుతామంటే ఎట్లా? పైగా ఎప్పుడూ “ఆమె జాకెట్టు.. ” అంటూ మొదలుపెడతారు.. ఆ జాకెట్టు చివికిపోయి కూడా ఉంటుంది. మీరు మాత్రం వదలరు” అన్నారు ఎగతాళిగా. గోపాలరెడ్డి గారు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ.. “ఇతని లాంటి ఈ తరం వాళ్ళకు తెలియాలిగా” అని నన్ను చూపిస్తూ బయలుదేరటానికి లేచారు. రెండు వారాల్లో పెట్టు అంటూ కృష్ణ గారిని ఆదేశించి. “నువ్వూ రావాలి” అని నాకు గుర్తు చేసి మరీ వెళ్లారు.
నిజంగానే రెండువారాలు తిరగకముందే ఒకానొక ఆదివారం నాడు పొట్టిశ్రీరాములు స్మారకమందిరంలో బెజవాడ గోపాలరెడ్డిగారు కవితా పఠనం ఏర్పాటైంది. మాలతీ చందూర్ గారు ఆయన రచనలను పరిచయం చేశారు. ‘ఆమె’ శీర్షికన ఆయన ఆమె నీడలు, ఆమె జాడలు, ఆమె తళుకులు .. లాంటి ఐదు సంపుటాలు వేసి వాటికి ‘ఆమె పంచకము’ అని పేరుపెట్టారని చెప్పారు. బీస్సార్ కృష్ణగారు వెటకరించినట్టే గోపాల్ రెడ్డి గారు “ఆమె ప్రేమ జాలములో చిక్కి గాలపు ఎరను మింగిన చేపవలె కొట్టుకుంటున్నాను” అని మొదలుపెట్టారు. ఆ తరువాత ‘ఆమె జాకెట్టు’ అనే కవిత కూడా రానే వచ్చింది.
రాజకీయాల్లో ఎన్నో పదవులు నిర్వహించిన బెజవాడ గోపాలరెడ్డి గారు 70 ఏళ్ల వయసులో కవిత్వం రాయటం, అందులోనూ శృంగారానికి ప్రాధాన్యం ఇవ్వటం ఆశ్చర్యమనిపించింది. అదే ఆయన్ని ఆఖరి సారి చూడటం. ఆ తరువాత సుమారు ఐదేళ్లకు ఆయన మరణ వార్త వినాల్సి వచ్చింది.

✍️ తోట భావనారాయణ

