Top 5 This Week

Related Posts

ఖమ్మంలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య ‘భూ కబ్జా’ లొల్లి!

(సమీక్ష ప్రత్యేక కథనం)
ఖమ్మంలో రాజకీయ ప్రత్యర్థులు పరస్పర ‘కబ్జా’ ఆరోపణలు చేసుకుంటున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు పరస్పరం భూ కబ్జా ఆరోపణలకు దిగుతుండడం రాజకీయ చర్చకు దారి తీసింది. అయితే ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు కూడా ప్రస్తుతం తాము నివాసముంటున్న ప్రాంతాలపై పరస్పరం ‘కబ్జా’ ఆరోపణలు చేసుకోవడమే అసలు విశేషం. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈనెల 19వ తేదీన ఖమ్మం పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు ఈ ఇద్దరు నేతల మధ్య ‘కబ్జా’ ఆరోపణలకు దారి తీయడం గమనార్హం.

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఖమ్మంలోని మమత ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి హరీష్ రావు ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులపైనా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రైతు భరోసా, రుణమాఫీ తదితర అంశాలపైనా హరీష్ రావు తనదైన శైలిలో ఆరోపణలు చేశారు.

హరీష్ రావు విమర్శలపై మంత్రి తుమ్మల ఈనెల 20వ తేదీన మీడియా సమావేశంలో మాట్లాడినప్పటి చిత్రం

ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఈనెల 20వ తేదీన స్పందించారు. ఓవైపు భూపాలపల్లిలో సీఎం సభ, రైతు భరోసా నిధుల విడుదల వంటి టూర్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నప్పటికీ, హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకుని తన క్యాంపు కార్యాలయంలో తుమ్మల మీడియా సమావేశం నిర్వహించారు. అటు హరీష్ రావు విమర్శలపైన, ఇటు ఖమ్మంలో తన రాజకీయ ప్రత్యర్థి పువ్వాడ అజయ్ పేరు ఉచ్ఛరించకుండానే తనదైన శైలిలో తుమ్మల విమర్శలు చేశారు.

తెలంగాణా ప్రజల్లో మట్టిగొట్టినటువంటి, మన్నుబోసినటువంటి, పార్టీలను మోసం చేసినటువంటి, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యపరంగా ప్రజలను అష్టకష్టాలపాల్జేసి, అధికార, అహంకారంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసి, వందలాది కేసులతో ప్రజలను చిత్రహింసలకు గురిచేసి, రాజ్యాధికారాన్ని వెలగబెట్టినటువంటి కబ్జాకోర్ల కబ్జా స్థలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అస్థిత్వం కోసం, పార్టీలో మనుగడ కోసం తనపై ఆరోపణలు చేశారని తుమ్మల ధ్వజమెత్తారు.

‘మీరు నిన్న మీటింగు పెట్టుకున్నది కూడా కబ్జా స్థలంలోనే.., కబ్జాకోర్లను, కమిషన్ దార్లను, కాంట్రాక్టర్లను పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు ఏ నీతులు చెప్పడానికి వచ్చావ్? నీ పక్కన కూర్చున్నోళ్లు ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని, తామేం చేశామో చెబుతాం’ అని మంత్రి తుమ్మల హరీష్ రావును ఉద్దేశించి ప్రశ్నించారు.

మంత్రి తుమ్మల ఆరోపణలపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఈనెల 21వ తేదీన మీడియా సమావేశంలో మాట్లాడినప్పటి చిత్రం

తుమ్మల విమర్శలు, ఆరోపణలపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కూడా వెంటనే స్పందించారు. హైదరాబాద్ తెలంగాణా భవన్ లో నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో అజయ్ మాట్లాడుతూ, తమ ఆసుపత్రి ప్రాంగణంలో పార్టీ సమావేశం నిర్వహించిన మాట వాస్తవమేనని, అది ఏ కబ్జాలో ఉందో చెప్పాలని తుమ్మలను డిమాండ్ చేశారు. ‘నువ్వు అధికారంలో ఉన్నావని, రెండున్నరేళ్లుగా మంత్రిగా ఉన్నావని, తాను ఛాలెంజ్ చేస్తున్నానని, అందులో ఏదేని కబ్జా ఉంటే వెంటనే చర్య తీసుకోవచ్చు’ అని కూడా అజయ్ సవాల్ చేశారు. చర్య తీసుకోని పక్షంలో తాము సమావేశం నిర్వహించిన ప్రాంతానికి వచ్చి తప్పుడు మాట మాట్లాడినట్లు ముక్కు నేలకు రాయాలని అజయ్ డిమాండ్ చేశారు. ఇవాళ ఖమ్మంలో జరుగుతున్న అరాచకానికి నిదర్శనంగా వెలుగుమట్ల ఘటనను యావత్ ప్రపంచం చూసిందని అజయ్ కుమార్ అన్నారు.

అదేవిధంగా ఖమ్మం నగరంలోని గొల్లగూడెంలో గల తుమ్మల నివాసముంటున్న ఇంటిపైనా అజయ్ కబ్జా ఆరోపణలు చేశారు. వెలుగుమట్ల కబ్జాకోరుడైన నీ అనుచరుడెవరైతే ఉన్నాడో, అతను వక్ఫ్ బోర్డు స్థలాలను కబ్జా చేసి నిర్మించిన ప్రాజెక్టులో ఉన్న ఇంటిగా గొల్లగూడెంలోని తుమ్మల నివాసాన్ని అజయ్ ఆరోపించారు. ఇక తుమ్మల రాజకీయ ప్రస్థానంపైనా అజయ్ మాట్లాడుతూ, వరదల్లో కొట్టుకువచ్చే తుమ్మ మొద్దు తన ఎఫర్ట్ ఏమీ లేకుండానే ఎక్కడో ఓచోట అగిన చందంగా అభివర్ణించారు. రాజకీయ పార్టీల వరదల్లో కొట్టుకువచ్చి మంత్రి పదవులను అనుభవించారని తుమ్మలను ఉద్ధేశించి విమర్శించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాల్లో నిర్వహించిన, నిర్వహిస్తున్న మంత్రి పదవులను అజయ్ ఈ సందర్భంగా ఉటంకించారు.

ఇక 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినపుడు అఫిడవిట్ లో లేని 12 ఎకరాల భూములు 2018, 2023 ఎన్నికల అఫిడవిట్ లోకి ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. నాగుపల్లి రెవెన్యూ పరిధిలోని షెడ్యూల్డు ఏరియా (1/70 యాక్ట్)లో గల ఆయా భూములు నీ పేరుపై పట్టాగా ఎలా మారిందో చెప్పాలన్నారు. వెలుగుమట్ల ఘటన జరిగినపుడు, వందలాది ఎకరాల పామాయిల్ తోటలు, ఇతర భూముల బాగోతం గురించి పలు యూ ట్యూబ్ ఛానల్స్ అనేక ప్రశ్నలు లేవనెత్తాయని గుర్తు చేశారు. తుమ్మల అనుచరులు చేస్తున్న భూకబ్జాలు, సెటిల్మెంట్లు ఖమ్మంలో కనిపిస్తున్నాయని అజయ్ కుమార్ అన్నారు.

జీవో 59 ద్వారా ఖమ్మంలో 69 మందికి లబ్ధిదారులకు చేసిన ప్రకారం.. తమ ఆసుపత్రిలో గల 2.00 ఎకరాల భూమిని రూ. 2.00 కోట్లు చెల్లించి 2016లో క్రమబద్దీకరించుకున్నట్లు అజయ్ చెప్పారు. ఈ సందర్భంలో తుమ్మల మంత్రిగా ఉన్నారని, తమ ఆసుపత్రిని 26 ఏళ్ల క్రితం చంద్రబాబునాయుడు ప్రారంభించారని చెప్పారు. అప్పుడు కూడా తుమ్మల మంత్రిగానే ఉన్నారని, ఈరోజు కబ్జా గురించి మాట్లాడడమేంటని అజయ్ ప్రశ్నించారు. తుమ్మల చెప్పే ఆవు కథలను వినడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు.

మొత్తంగా హరీష్ రావు పర్యటన ఖమ్మం నియోజకవర్గంలోని ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల మధ్య ‘కబ్జా’ ఆరోపణలకు దారి తీసిందనే చెప్పాలి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శల మధ్య ఘాటు వ్యాఖ్యలకు దారి తీస్తున్న ‘కబ్జా’ ఆరోపణలు రాజకీయంగా సహజంగానే చర్చనీయాంశంగా మారాయి.

Popular Articles