Top 5 This Week

Related Posts

రూ. 225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి పనులు

హైదరాబాద్: బాసర ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఈనెల 6వ తేదీన బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈమేరకు బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్న రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Popular Articles