విశాఖపట్నం: విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని చంపి ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో దాచిపెట్టాడో ప్రియుడు. ఆ తర్వాత నిందితుడు స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.
పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెడితే.. విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని ఎల్వీనగర్ ప్రాంతంలో ఉంటున్న నేవీ ఉద్యోగి రవీంద్రకు పెళ్ళై భార్య ఉంది. ఇదే దశలో మౌనిక (28) అనే మరో మహిళతో ప్రేమాయణం నడిపి, వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అయితే మౌనిక ఇటీవల డబ్బుల కోసం వేధిస్తుండటంతో ఆమెను హత్య చేసుందుకు రవీంద్ర పథక రచన చేశాడు. ఇందులో భాగంగానే భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో తన ప్రియురాలు మౌనిక(28)ను రవీంద్ర తన ఇంటికి పిలిపించుకున్నాడు.
ఈ సందర్భంగా రవీంద్ర, మైనికల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రవీంద్ర కత్తితో మౌనికను కిరాతకంగా చంపి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా కోసి సగ భాగాన్ని ఫ్రిజ్ లో ఉంచి, మరో సగ భాగం మూట కట్టి ఇంట్లో మూలకు ఉంచిన అనంతరం రవీంద్ర పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు రవీంద్రను వెంటబెట్టుకుని ఫ్రిజ్ లో గల రెండు మూటల మౌనిక శరీర భాగాలను కనుగొన్నారు. అయితే తలభాగం మాత్రం అక్కడ లేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
మౌనిక తనను డబ్బుల కోసం వేధిస్తుండటంతోనే ఈ హత్య చేశానని రవీంద్ర పోలీసులకు తెలిపాడు. లక్షలాది రూపాయలను ఇప్పటికే మౌనికకు ఇచ్చానని, తన ఉద్యోగ ఐడీ కార్డు కూడా తీసుకుని వేధిస్తున్నట్లు నిందితుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే రవీంద్ర చెప్పిన అంశాల్లో నిజానిజాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీంను రప్పించి మరిన్ని వివరాలు, ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.

