Top 5 This Week

Related Posts

‘చేతగాని శాఖలో 30 ఏళ్ళుగా పనిచేస్తున్నందుకు..’: డిప్యూటీ కమిషనర్ పోస్ట్ కలకలం

నిజామాబాద్: సాధారణంగా ‘యూనిఫాం’ ప్రభుత్వ శాఖల్లో దిగువ స్థాయి సిబ్బంది ఉన్నతాధికారుల వేధింపులకు, సూటిపోటి మాటలకు బలి అవుతుంటారు. కానీ ‘యూనిఫాం’ విభాగానికే చెందిన ఓ ఉన్నతాధికారి అత్యున్నత స్థాయి అధికారి నుంచి వినలేని, భరించలేని మాటలను ఎదుర్కుంటే ఎలా ఉంటుంది? ఉన్నతాధికారి అంటే ఏ ఎస్ఐ లేదా సీఐ స్థాయి అధికారి కాదు సుమీ.. పోలీసు అధికారితో పోల్చాలంటే సీనియర్ ఎస్పీ స్థాయి ఉన్నతాధికారి అన్నమాట.

ఆయనే నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి.. గ్రూప్-2 అధికారిగా ఎక్సైజ్ శాఖలో చేరి, డిప్యూటీ కమిషనర్ స్థాయికి ఎదిగిన సోమిరెడ్డి కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లిన మేథాశక్తి గల ఉన్నతాధికారి. సోషల్ మీడియా వేదికగా ఈ అధికారి అత్యంత ఆవేదనతో విడుదల చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కమిషనర్ కార్యాలయానికి వెళ్లినపుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను తట్టుకోలేక ఉద్యోగాన్నే వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డారంటే పరిస్థితిని అవగతం చేసుకోవచ్చని ఎక్సైజ్ అధికార వర్గాలు చెబుతున్నాయి.

డిప్యూటీ కమిషనర్ అయినటువంటి తనను కమిషనర్ దుర్భాషలాడారని, వాటిని తట్టుకోలేక కిందపడిపోగా, స్నేహితులు ఆసుపత్రికి తరలించారని సోమిరెడ్డి చెబుతున్నారు. సోమిరెడ్డిని దూషించిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని, అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఘటనపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలని కూడా ప్రభుత్వాన్ని కోరింది. సోషల్ మీడియాలో సోమిరెడ్డి విడుదల చేసిన పోస్టును దిగువన యధాతథంగా చదవవచ్చు..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి

ఉన్నతాధికారులకు, మిత్రులకు, ఎక్సైజ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు!
ప్రస్తుతం నా ఆరోగ్యం మంచిగానే ఉంది.
మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు!
నాలాంటి వ్యక్తి ఈ శాఖలో ఇమడ లేడని చాలా సార్లు అనిపించింది. నా మేలుకోరే ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో నెట్టుకొచ్చాను. వారికి ఎప్పటికి బుుణపడి ఉంటాను. ఇక నేను ఇక్కడ ఇమడ లేనని పూర్తిగా అర్ధం అయ్యింది.

చేయని తప్పుకి “వెధవ , ఇడియట్” అన్నప్పుడు నాలో సున్నిత మనస్తత్వం ఆ మాటను స్వీకరించలేక పోయింది. నేను ఒక్కటే మాట ఎదురు చెప్పాను,

“ అలాంటి మాట అనొద్దు సార్ “ అని మాత్రమే . నేను ఎదురు చెప్పిన ఆ చిన్న మాటకు కమీషనర్ గారి ఈగో హర్ట్ అయిందనుకుంటా! ఎవరు ఎన్నడు ఎదురు చెప్పి ఉండరు కదా!

“10 నిమిషాలు పైగా నన్ను నువ్వు వెధవాతి వెధవవవు, నువ్వు చేసిన వెధవ పనులు అంటూ నాకు సంబంధం లేనివి చదివాడు. నా జీవితంలో ఎన్నడు ఎదుర్కోని ఘోర అవమానం చేసాడు. నాతోనే , నేను వెధవను అనిపించేలా ప్రయత్నం చేసాడు.

అదే గదిలో నలుగురు అధికారులు మరియు సిబ్బంది ఉన్నారు. వారి ముందు ఆ విపత్కర పరిస్థితి చాలా మానసిక వ్యథకు గురి చేసింది. అయినా తట్టుకున్నాను.

బయటకు వచ్చి విషయం మిత్రులకు, అధికారులకు చెప్పాను. అలా ఎలా మనల్ని అంటాడని అందరికి చెప్పాను. ప్రశ్నిద్దాం అని చెప్పాను.
కమీషనర్ అవమానించిన దాని కన్నా కూడా అన్నాయాన్ని ప్రశ్నిద్దాం అన్నప్పుడు ఆలోచనలో పడ్డ అధికారుల మరియు మిత్రుల భయం , మౌనం నన్ను బాగా కలచి వేసింది. అక్కడే కుప్పకూలి పోయాను. మిత్రులు హాస్పటల్ కు చేర్చారని తర్వాత తెలిసింది. వారికి నా కుటుంబం తరపున కృతజ్ఞతలు 🙏

అరేయ్, ఓరేయ్, వెధవ, ఇడియట్, యూసిలెస్ ఫెలో ఇలా చాలా అవమానకరమైన పదాలతో తిట్టినా , దూషించినా ఇన్నాళ్లు నెట్టుకొస్తున్న అధికారులకు, మిత్రులకు మరియు ఇతర అధికారులకు నమస్కారం!

నేను పెరిగిన వాతావరణంలో ఆత్మాభిమానంతో బ్రతకడమే జీవితం అని నమ్మాను.

ఆకలితో నైనా చస్తాం కాని ఆత్మాభిమానం వదులుకోలేం” అన్న కాళోజి మాటలు యాది చేసుకుంటూ “

చేతకాని, చావలేని , చైతన్యం చచ్చిపోయిన శాఖలో 30 సంవత్సరాలు పనిచేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను.”

నా కుటుంబ సభ్యులతో చర్చించాను,

ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదని తలచి శాఖను (ఉద్యోగం) వీడివెళ్లాలని బాధతో నిర్ణయించుకున్నాను.
ఇన్ని సంవత్సరాలు నాతో ప్రయాణం చేసిన , నాకు సహకరించిన ఉన్నతాధికారులకు
మిత్రులకు మరియు సిబ్బందికి
కృతజ్ఞతలు. 🙏

ఇట్లు
సోమిరెడ్డి
డిప్యూటీ కమిషనర్
నిజామాబాద్ డివిజన్.

#ఈ పోస్టు ఎంతో మానసిక సంఘర్షణకు లోనై పెడుతున్నాను.

Popular Articles