Top 5 This Week

Related Posts

కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాం రాం: మరికాసేపట్లో బల ప్రదర్శన

జగిత్యాల: కాంగ్రెస్ పార్టీతో పెనవేసుకున్న నాలుగు దశాబ్ధాల అనుబంధాన్ని జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరికాసేపట్లో తెంచుకోబోతున్నారు. జగిత్యాల వేదికగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. పట్టణంలోని బండారి గార్డెన్స్ లో తన అనుచరులతో బుధవారం సమావేశమవుతున్న జీవన్ రెడ్డి భవిష్యత్ రాజకీయ కార్యాచరణను రూపొందించుకోబోతున్నారు. తన అనుయాయులతో, అభిమానులతో సమావేశమై, వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత జీవన్ రెడ్డి రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

జగిత్యాల జిల్లాతో మిళితమైన అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డి అనుయాయులు, అనుచరులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా జగిత్యాల, చొప్పదండి, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ నియోజకవర్గాలకు చెందిన జీవన్ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున సమావేశానికి తరలివచ్చే ఛాన్సుంది. దాదాపు ఐదారు వేల మంది ఈ సమావేశానికి హాజరవుతారని తెలుస్తుండగా, ఈ సంఖ్య పది వేల వరకు చేరినా ఆశ్చర్యం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సమావేశానంతరం జీవన్ రెడ్డి ప్రకటించే నిర్ణయంపైనే రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నాయకులతో పాటు, బీజేపీకి చెందిన ముఖ్యులు సైతం జీవన్ రెడ్డిని కలిసి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే దశలో కల్వకుంట్ల కవిత కూడా జీవన్ రెడ్డిని కలిసే అవకాశముందంటున్నారు. కానీ ఏ పార్టీలో చేరాలనే అంశంలో ఇప్పటికిప్పుడు జీవన్ రెడ్డి నిర్ణయంతీసుకోకపోవచ్చని సమాచారం.

రాజీనామా అనంతరం కొంతకాలం పాటు జిల్లాల వారీగా పర్యటించి, పార్టీ పరంగా తనకు జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ కేడర్ కు, ప్రజలకు వివరిస్తూ పర్యటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నటువంటి తనలాంటి సీనియర్ నేతలకు జరిగిన అన్యాయంపై జీవన్ రెడ్డి జనంలోనే ‘దండోరా’ మోగించేందుకు సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి తాజా అడుగులు ఉత్తర తెలంగాణా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం కలిగించవచ్చని రాజకీయ పరిశీలకులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ నష్టాన్ని నివారించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఆది శ్రీనివాస్, వంశీచందర్ రెడ్డి తదితరులు చేసిన చివరి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కాంగ్రెస్ లో కొనసాగేందుకు జీవన్ రెడ్డి ససేమిరా అంగీకరించలేదు.

Popular Articles