హైదరాబాద్: మున్సిపాలిటీల్లో కొలువుదీరిన నూతన పాలకులకు తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సూచనలు చేశారు. పట్టణాల్లోని ప్రతి వార్డు, డివిజన్ అభివృద్ధి చెందాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కూడిన పూర్తి పాలకవర్గం పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలన్నారు. ముఖ్యంగా వార్డులు, డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన పాలకవర్గాలు పనిచేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు నూతనంగా ఎన్నికైన మేయర్, చైర్మన్లతో పాటు, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లు , నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు మంత్రి పొంగులేటి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ నూతన సారథులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాల అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదర్శవంతమైన పాలన అందించాలని సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన మూడ్ గణేష్ (సీపీఐ), డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సిరిపురపు లలిత (కాంగ్రెస్)లకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

