నేలకొండపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రజా ప్రభుత్వం దాదాపు రెండున్నరేళ్లుగా ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను అధికారులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గతంలో ప్రజలు అధికారుల చుట్టూ తిరిగే వారని, ప్రస్తుతం ఇందిరమ్మ పాలనలో అధికారులు ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే పరిమితమని, అనంతరం ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పారదర్శకంగా వివరాలు తెలియజేస్తూ పాలన కొనసాగిస్తున్నామన్నారు. ప్రజా దర్బార్ లో వచ్చిన ఫిర్యాదులను వారం, నెల, మూడు నెలల వ్యవధిలో పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి ప్రతి ఉమ్మడి జిల్లా పరిధి లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి రెవెన్యూ, హౌజింగ్ శాఖల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
వేసవి కాలంలో తాగునీరు, విద్యుత్ సమస్యల నివారణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలోని సమస్యలనుపరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. న్యాయమైన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి ఈ సంర్భంగా భరోసా ఇచ్చారు. మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని చెప్పారు. క్లస్టర్ సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను అదే చోట పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు, భూ సమస్యలు, పెండింగ్ పెన్షన్లు, తదితర అంశాలను గుర్తించి పరిష్కరిస్తున్నామని తెలిపారు.
అనంతరం రాయిగూడెం, అజయ్‌తండా, చెరువు మాదారం, మంగాపురం తండా, అప్పల నరసింహపురం, బుద్ధారం, కట్టుకాచారం, కొంగర, రాజారాంపేట, భైరవునిపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలతో మంత్రి ముఖాముఖి భేటీ అయ్యారు. ప్రజాదర్బార్ లో సమస్యలువింటూ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు పి. శ్రీనివాసరెడ్డి, పి. శ్రీజ తదితరులు పాల్గొన్నారు.

