(సమీక్ష ప్రత్యేక కథనం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి ఎంపిక రసకందాయంలో పడింది. అటవీ భూముల దురాక్రమణ అంశంలో రెండేళ్ల క్రితమే తీవ్ర వివాదాస్పదమై వార్తల్లోకి వచ్చిన ఓ వ్యక్తి కుటుంబం నుంచి గెలుపొందిన కౌన్సిలర్ చైర్మెన్ పదవి రేసులో ఉండడంపైనే కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుండగా, తాజాగా లిక్కర్ ‘సిండికేట్’ దందా బాగోతం ఇందుకు తోడైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల్లో ఇల్లెందు మున్సిపల్ చైర్ పర్సన్ పదవి రూ. కోట్ల మొత్తపు లిక్కర్ వ్యాపారంతో కూడా ముడిపడి ఉందనే చర్చ ఇల్లెందు ప్రజల్లో తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఈ ఆసక్తికర వివరాల్లోకి వెడితే..
ఇల్లెందు పట్టణంలో మొత్తం ఎనిమిది వైన్ షాపులు ఉన్నాయి. ఇందులో ఒక్కో షాపు చొప్పున బీఆర్ఎస్ లో తిరిగే లిక్కర్ వ్యాపారికి, మరో షాపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుని అనుచరునికి టెండర్లలో దక్కాయి. అయితే ఇతరులకు దక్కిన మిగతా ఆరు వైన్ షాపులను ఆయా ఇద్దరు వ్యక్తులు ‘గుడ్ విల్’ చెల్లింపు ప్రాతిపదికన చెరో మూడింటిని కొనుగోలు చేశారు. సాంకేతికంగా టెండర్లల్లో షాపులను దక్కించుకున్న వ్యక్తుల పేర్లే ఎక్సైజ్ రికార్డుల్లో ఉన్నప్పటికీ, వీటి వ్యాపార నిర్వహణ మాత్రం ఆయా ఇద్దరు కీలక వ్యక్తుల హస్తగతమైంది.
అయితే ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల దాఖలు పర్వానికి ఒకటి, రెండు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఓ లిక్కర్ వ్యాపారి తన కుటుంబంలోని వ్యక్తికి పార్టీ టికెట్ ఇప్పించుకోవడంలో సఫలమయ్యాడు. ప్రస్తుతం చైర్మెన్ పదవి రేసులోనూ లిక్కర్ వ్యాపారి కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మున్సిపల్ చైర్మెన్ పదవిని ఆశిస్తున్న వ్యాపారికి, ఇల్లెందు లిక్కర్ సిండికేట్ దందాకు ‘మెలిక’ పెడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తిరుగులేని లిక్కర్ ‘సిండికేట్’ దందా నడిపిస్తున్నట్లు ప్రాచుర్యంలో గల వ్యక్తికీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత అనుచరునికీ మధ్య ఈ అంశంలో రసవత్తర ఒప్పందం దిశగా చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి:
ఈ ప్రచారపు సారాంశం ప్రకారం.. గత డిసెంబర్ నుంచి ప్రారంభమైన ఎక్సైజ్ సంవత్సరంలో వ్యాపారం నిర్వహించుకునేందుకు వైన్ షాపుల టెండర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెండర్లలో ఓ షాపు దక్కించుకుని, మరో మూడు షాపులను కొనుగోలు చేసిన ఇల్లెందుకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేత అనుచరునికి ‘సిండికేట్’ దందాను అప్పగించాలనే డిమాండ్ గత రెండున్నర నెలలుగా జరుగుతోందట. కానీ, ఇందుకు మొన్నటి వరకు బీఆర్ఎస్ లో గల మరో లిక్కర్ వ్యాపారి ససేమిరా అన్నారుట.
ఈ నేపథ్యంలోనే ఆ వ్యాపారికి చెందిన షాపుల్లో లిక్కర్ సరుకును కొనుగోలు చేసిన బెల్ట్ షాపు నిర్వాహకులపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వరుస దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గడచిన రెండున్నర నెలల్లో ఇల్లెందు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మొత్తం 21 కేసులు నమోదు కాగా, ఇందులో ఎక్కువ కేసులు సిండికేట్ వ్యాపారికి చెందిన షాపుల్లో సరుకు కొనుగోలు చేసిన బెల్ట్ షాపుల నిర్వాహకులపైనే నమోదైనట్లు తెలుస్తోంది.
దీంతో ఇప్పటి వరకు లిక్కర్ సిండికేట్ దందాను గుప్పిట పట్టుకున్న ఆ వ్యాపారి వైన్ షాపుల్లో ‘సరుకు’ కొనేందుకు బెల్ట్ షాపు నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారట. అయితే ప్రస్తుతం ఈ లిక్కర్ వ్యాపారి కుటుంబం మున్సిపల్ చైర్మెన్ పదవిని ఆశిస్తున్న పరిణామాల్లో ‘సిండికేట్’ దందాను అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుని చేతికి అప్పగించాలనే డిామాండ్ తాజాగా మరోసారి తెరపైకి వచ్చినట్లు సమాచారం.

దీంతో ఇల్లెందు మున్సిపల్ చైర్మెన్ పదవికి అభ్యర్థి ఎంపిక కోట్ల రూపాయల విలువైన లిక్కర్ ‘సిండికేట్’ దందాతో ముడిపడి ఉందనే ప్రచారం ఇల్లెందులో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చైర్మెన్ పదవికి అభ్యర్థి ఎంపికలో లిక్కర్ బిజినెస్ టార్గెట్ పరిణామాలు ఎటు దారి తీస్తాయనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను కలిగిస్తోంది. ఇదీ ఇల్లెందు మున్సిపల్ పదవిలో అంతర్లీనంగా దాగినట్లు ప్రాచుర్యంలోకి వచ్చిన లిక్కర్ ‘సిండికేట్’ మెలిక కథ!

