ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలో శనివారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గ ప్రజల దీవెనలతో తాను ఎమ్మెల్యేను అయ్యానని, ప్రభుత్వం వచ్చాక మంచి మంత్రిని అయ్యానని, ఇల్లు ఇచ్చే మంత్రిని తానేనని, ఇంటి స్థలం ఇచ్చే మంత్రిని కూడా తానేనని పొంగులేటి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు అనేక మంది మీ వద్దకు వస్తారని, సొల్లు కబుర్లు చెవుతారని కూడా మంత్రి ఈ సందర్భంగా అన్నారు.
‘స్థానిక ఎమ్మెల్యేను నేనే, మంత్రిని నేనే, సీఎం మనోడే, ఎంపీ మనోడే, ప్రభుత్వం మీది.. ఏ పని చేయాలన్నా, ఏ పని కావాలన్నా, ప్రభుత్వం నుంచి ఏది సాధించాలన్నా, మీ దీవెనలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చే అభ్యర్థులను మనస్ఫూర్తిగా, హస్తం గుర్తు మీద వేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరుతున్నాను’ అని మంత్రి పొంగులేటి అన్నారు. స్థానిక ప్రజలు అడిగే సమస్యలను పరిష్కరించే బాధ్యత ఇంటి పెద్ద కొడుకుగా తనదేనని మంత్రి పొంగులేటి చెప్పారు.

ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే వర్షాకాలం నాటికి మున్నేరు రక్షణ గోడను పూర్తి చేస్తామన్నారు. రెండు ఘాట్లను కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎఫ్.సి.ఐ గోడౌన్ ను తరలిస్తాన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 5, 6, 25వ వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు.

