Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

సత్తుపల్లి పాలి‘ట్రిక్స్’లో సంచలనం: మంత్రి ‘తుమ్మల’ వీర విధేయుని వైరాగ్యం!

నన్ను ప్రాణ ప్రదంగా అభిమానించే ఆత్మీయ మిత్రులు అందరికీ నా హృదయ పూర్వక నమస్కారములు… తెలియ చేస్తూ నా మనసులో నేను పడుతున్న సంఘర్షణ మీ ముందు ఉంచుతూ నా నిర్ణయాన్ని మీరు పెద్ద మనసుతో గౌరవిస్తారని ఆశిస్తున్నాను.

రాజకీయాల్లోకి నేను గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న సంగతి మీ అందరికీ తెలియనిది కాదు. ముఖ్యంగా క్రియాశీలక రాజకీయాల్లోకి 1991 నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్నాను మొదటిసారిగా క్రియాశీలక రాజకీయాల్లోకి నేను ప్రవేశించింది 1991 సొసైటీ ఎన్నికల్లో ద్వారా. తర్వాత కాలంలో ఈ 35 సంవత్సరాల్లో అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు విశ్రాంతి లేకుండా పార్ట్ టైం రాజకీయాలు కాకుండా రాజకీయాల్లో నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తూ పనిచేస్తున్నాననే సంగతి మీకు తెలియదు కాదు. ఈ 35 సంవత్సరాలలో అనేక సంఘటనలో అనేకమైన నష్టాలను అనేకమైన కష్టాలను భరిస్తూ ముందుకు నడవడానికి ఓపిక లేక ఆగి పోదామంటే.. ఆత్మీయుల ఒత్తిడి భరించలేక ఒక అయోమయ స్థితిలోనే ఇంతకాలం నా జీవితం కొనసాగింది.

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో చల్లగుళ్ల నరసింహారావు (ఫైల్ ఫొటో)

నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా పిల్లల వయసు నాలుగు సంవత్సరాలు. ఇప్పుడు నా మనవళ్ల వయసు మనవరాలు వయసు ఏడు సంవత్సరాలు. ఇంత సుదీర్ఘకాలం ఇన్ని ఇబ్బందులు పడుతూ కూడా మీరు ఎందుకు కొనసాగుతున్నారని మీకు అందరికీ అనుమానం రావచ్చు. కానీ నేను అత్యంత అభిమానించి నా అభిమాన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారి మీద నాకున్న అత్యంత ప్రేమాభిమానాలే నాకు ఇంధనముగా నడుపుకుంటూ కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా జీవిత ప్రయాణాన్ని రాజకీయాల్లో కొనసాగిస్తూ వచ్చాను. ఈ 40 సంవత్సరాల కాలంలో నేను ఒక్కసారి కూడా తెలిసి తప్పు చేయలేదని ఎవరికీ కావాలని నష్టం చేయలేదని ఆత్మసాక్షిగా గుండె మీద చేయి వేసుకొని చెప్పగలను.

ఈ ప్రయాణంలో నేను నా కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేసి వారిని ఇబ్బంది పెట్టాననేది నా మనసులో తొలిచి వేస్తున్న బాధ. అది మీకు బయట కనపడేది కాదు. ఇప్పుడు నా వయసు 67 సంవత్సరాల నుండి 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాను. నా భార్య నిర్మల వయసు 61. ఇప్పుడు మా కుటుంబం ప్రశాంతంగా పిల్లలతో మనవళ్లు మనవరాళ్లతో సంతోషంగా గడిపే సమయం. ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికల సమరం మన ముందుకు వచ్చింది. వాస్తవంగా నేను మొన్న అక్టోబర్ లో అమెరికా వెళ్ళటానికి ప్రధాన కారణం.. మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ రాజకీయాలనుంచి ఎన్నికల సమయంలో దూరంగా ఉండాలనే.

ఒక్కసారి రాజకీయాలనుంచి ఎన్నికల బరి నుంచి ఎడంగా జరిగితే నాకు ప్రజలతో సంబంధాలు పక్కకు వెళ్లిపోతాయని తద్వారా ఈ క్రియాశీలక రాజకీయాల నుంచి ప్రజల నుంచి నాకున్న అనుబంధం తెగిపోతే ఈ ఆఖరి జీవిత కాలంలో ప్రశాంతంగా ఉండాలనే నా మనసులో ప్లాన్ చేసుకుని అమెరికా వెళ్ళటం జరిగింది. దురదృష్టవశాత్తు మా బంధువుల్లో జరిగిన కొన్ని ఇబ్బందుల వలన వెంటనే వెనక రావటం జరిగింది. వచ్చిన దగ్గరనుంచి నా చేతనైన వరకు పంచాయతీ ఎన్నికల్లో పనిచేశా. తర్వాత కాలంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమరం మొదలైంది. నా ఆత్మీయుల అందరి కోరిక ఒకసారి నన్ను మంచి పదవిలో చూడాలని.. నాకు మాత్రం ఈ వయసులో మనకి ఇంకా క్రియాశీలకమైన రాజకీయాల అవసరమా? ఈ టెన్షన్స్ అవసరమా? అనే సంఘర్షణకి లోను అవుతున్నా.

కానీ మిత్రుల ఒత్తిడికి ఒక్కోసారి తలొగ్గిపోతున్న ఈ ఎన్నికల రిజర్వేషన్లు జనరల్ అయితే నన్ను ఆ పదవిలో చూడాలని నా ఆత్మీయ మిత్రులు, నేను అత్యంత అభిమానించే తుమ్మల నాగేశ్వరరావు గారు, మా పిల్లలు కోరుకున్న మాట మాత్రం నిజం. కానీ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ అవటంవల్ల నేను నా నిర్ణయాన్ని బయటకు చెప్పలేకపోతున్నా. ఎందుకంటే నేను నిలబడే అవకాశం లేదు. మా ఆవిడ వయసు 61 సంవత్సరాలు. ఆరోగ్యం అంతంత మాత్రం ఈ 40 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా నా రాజకీయ ప్రయాణాన్ని ఆమె ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కుటుంబాన్ని పట్టించుకోకపోయినా నన్ను అడ్డుకోలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే నేను ప్రజలకు ఏమి సేవ చేశానో చెప్పలేక పోవచ్చుగాని, నా కుటుంబానికి మాత్రం నష్టం చేశానని మాత్రం చెప్పగలను. అయితే అది నా కుటుంబం ఎప్పుడూ కూడా నన్ను నా ప్రయాణం నుంచి అడ్డుకోకపోవడం వలననే ఇంతకాలం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో వచ్చి 31 సంవత్సరాల వయసులో నేను సత్తుపల్లి సొసైటీ అధ్యక్షుడిగా ప్రజలకు పనిచేసినట్టు ఈ 68 సంవత్సరాల వయసులో చేస్తానని నా మనసే నాకు ధైర్యం ఇవ్వటం లేదు. అందుకనే ఆత్మీయులు గత పది రోజులుగా ఎన్ని ఒత్తిడిలకు గురిచేసిన ఆఖరు సారి నన్ను పదవి లో చూడాలని బలియంగా కోరుతున్నా నేను మాత్రం ఇప్పటివరకు నిర్ణయం ప్రకటించలేకపోతున్నా.

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో చల్లగుళ్ల నరసింహారావు (ఫైల్ ఫొటో)

నాకున్న ప్రస్తుత పరిస్థితుల బట్టి వయసు రీత్యా ఆరోగ్య రీత్యా నేను మళ్ళీ క్రియాశీలక రాజకీయంలో ప్రవేశించి ఆ పదవికి న్యాయం చేయలేనని ఆందోళనకు గురవుతున్న. ఆ పదవికి న్యాయం చేయకపోతే నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నాయకత్వానికి నేను ద్రోహం చేసినట్లు అవుతుంది. ఇంకొకటి ఏమిటంటే గతంలో నేను రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు ఆర్థికపరమైన అంశాలకు ప్రజలు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. ఇతన్ని గెలిపిస్తే మనకు పనులు చేస్తాడా? చేయడా? అని మాత్రమే ఆలోచించేవాళ్ళు. ప్రస్తుత పరిస్థితి మీకు అందరికీ తెలియంది కాదు.

రాజకీయం, ప్రజాసేవ ఇప్పుడు చాలా ఖరీదుగా మారింది. ప్రజలకు సేవ చేయాలంటే డబ్బులు ఖర్చుపెట్టి, పదవులు తెచ్చుకొని సేవ చేయాల్సి వస్తుంది, పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి పెట్టిన డబ్బులు తీసుకోవటానికి ప్రయత్నాలు చేయటం జరుగుతుంది. ఈ పరిస్థితులు దృష్ట్యా ఇంతకాలం ఎవరితో మాట పడకుండా ఒక్క అవినీతి పని కూడా చేయకుండా, ఒక్కరి రూపాయి ఆశించకుండా పనిచేశానని ఆత్మసాక్షిగా నా మనసుకి నేను చెప్పుకునే సమాధానాన్ని ఇప్పుడు పదవిలోకి వచ్చి ఒత్తిడిలు భరించి మార్చుకోలేను. ఈ వయసులో పదవీ భారాన్ని నెత్తిన పెట్టుకొని దానికి న్యాయం చేయలేనని నా మనసు హెచ్చరిస్తుంది. ఈ హెచ్చరికను నేను నిర్లక్ష్యం చేసి తర్వాత బాధపడలేను.

ఇప్పటిదాకా నేను ఇష్టం ఉన్నా, లేకపోయినా, కష్టమైనా, సుఖమైన రాజకీయాల్లో కొనసాగుతూనే వచ్చాను. ఇప్పుడు నా కుటుంబాన్ని తీసుకొచ్చి పదవుల కోసం వాళ్లను ఇబ్బందులు పెట్టలేను. నా రాజకీయ స్వార్థం కోసం ప్రశాంతంగా బ్రతుకుతున్న వాళ్లను ఈ రొచ్చులోకి లాగటానికి ఎంత ప్రయత్నించినా నా మనసు ఒప్పుకోవడం లేదు. అందుకే ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పలేక ఈ వేదిక ద్వారా నా మనసులో భావాలను వ్యక్తపరుస్తున్న. నన్ను పోటీ చేయాలని కోరిన నాయకత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాలు రావడమనేది నా 40 సంవత్సరాల కష్టమైన ప్రయాణమే కారణమని నా అభిప్రాయం.

ఇప్పటివరకు నన్ను అభిమానించిన మిత్రులందరికీ నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి గౌరవంగా ఎలా బతకాలో నేర్పిన నా ఆత్మీయ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రెండు సంవత్సరాలుగా నన్ను అభిమానించి గౌరవించిన మన ప్రియతమ ఎమ్మెల్యే మట్టా రాగమయిగారికి, నేను అత్యంత అభిమానించే దయానంద్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయకపోయినా, నా కుటుంబం పోటీ చేయకపోయినా, క్రియాశీలకంగా ఉండలేక పోయినా, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవడానికి నాకు చేతనైనంత, నాశక్తి మేరకు నా మిత్రులందరికీ కోసం పని చేస్తానని మాట ఇవ్వదలుచుకున్న.

కాబట్టి ఇక నుంచి ఎవరూ కూడా నా రాజకీయ ప్రయాణాన్ని నేను నిర్ణయించుకునే విధంగానే కొనసాగాలని మీరు భావించాలని, నన్ను ఒత్తిడి చేయవద్దని నా బాధని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.
ఇట్లు
మీ చల్లగుళ్ళ నరసింహారావు

Popular Articles