Top 5 This Week

Related Posts

ఇంగ్లీష్ పత్రిక నిర్వాహకునిపై NHRCకి, పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్: ‘ది పయనీర్’ అనే ఇంగ్లీష్ పత్రికను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న యాజమాన్యంపై అందులో పనిచేసిన వికలాంగ ఉద్యోగి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితునిగా పేర్కొంటున్న ఆయా ఉద్యోగి జాతీయ మానవ హక్కుల సంఘానికి, వికలాంగుల సంక్షేమ సంస్థకు కూడా ఇంగ్లీష్ పత్రిక నిర్వాహకునిపై ఫిర్యాదు చేయడం గమనార్హం. తాను పనిచేసిన పూర్తి కాలానికి వేతనం ఇవ్వకుండా బెదిరింపులకు గురిచేస్తూ తీవ్ర వేదనకు గురి చేస్తున్న సంస్థ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని ఫిర్యాదుదారుడు పోలీసులను, ఎన్ హెచ్ ఆర్ సీ, వికలాంగుల సంక్షేమ సంస్థ అధికారులను అభ్యర్థించారు.

రాజా నర్సింగరావు

బాధితుడు చేసిన ఫిర్యాదు ప్రకారం.. బాస రాజా నర్సింగరావు అనే వికలాంగుడు ‘ది పయనీర్’ అనే ఇంగ్లీష్ దినపత్రికలో పేజీ డిజైనర్ గా పనిచేశాడు. ఎంప్లాయి నెం. 1161 ద్వారా ఇతను ఏడాది పాటు ఆ పత్రికలో పని చేశాడు. అయితే జూలై, ఆగస్టు నెలల్లో పనిచేసినందుకు తనకు జీతం ఇవ్వలేదని రాజా నర్సింగరావు పేర్కొన్నారు. తాను వికలాంగుడినని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు రావలసిన జీతం కోసం 15-20 సార్లు ఆఫీసుకు వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. తన జీతం ఇచ్చే విషయంలో యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా, అక్కడ పనిచేసే స్టాఫ్ తో తనను బెదిరిస్తూ, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో.. అంటూ దుర్భాషలాడి అవమానించారని నర్సింగరావు పేర్కొన్నారు. జీతం వసూల్ కోసం తాను ఎప్పుడు వెళ్లినా ఎండి కృష్ణప్రసాద్ మాత్రం అక్కడ ఉండేవారు కాదని, కనీసం ఫోన్ చేసినా ఆయన అందుబాటులో ఉండరని, తన ఫోన్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి తనను వేదినకు గురి చేస్తున్నారని నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. జీతం వసూల్ కోసం వికలాంగుడినైన తాను నడవలేక ఆటోలో ఎల్బీ నగర్ నుంచి ప్రతి రోజూ డబ్బు చెల్లిస్తూ వెళ్లడం ఆర్థికంగా చాలా కష్టంగా ఉందన్నారు. అప్పు చేసి మరీ వెళ్లాల్సి వస్తోందని, తాను పనిచేసిన కాలనికే కష్టార్జితపు జీతం డబ్బు ఇవ్వండి అంటే, తనను శారీరకంగా, మానసికంగా, తన వికలాంగత్వాన్ని అని పదే పదే అవహేళన చేస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తన జీతం డబ్బులు తనకు ఇప్పించాలని అభ్యర్థిస్తూ వికలాంగుల చట్టం హక్కు కమిషనర్ కు, ఖైరతాబాద్ పోలీసులకు, జాతీయ మానవ హక్కుల సంఘానికి నర్సింగరావు ఫిర్యాదు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డితో కృష్ణప్రసాద్ (ఫైల్ ఫొటో)

కాగా ఈ ఆరోపణల అంశంలో ‘ది పయనీర్’ ప్రధాన యాజమాన్యానికి ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చని ‘సమీక్ష’ న్యూస్ స్పష్టీకరిస్తోంది. ఎందుకంటే కోల్ కతా ప్రధాన కేంద్రంగా వెలువడే ‘ది పయనీర్’ సంస్థ యాజమాన్యం దేశంలోని వివిధ రాష్ట్రాలకు తన పత్రిక ప్రచురణ హక్కులను ‘ఫ్రాంచైజీ’ పద్ధతుల్లో అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బి. కృష్ణప్రసాద్ అనే పూర్వ జర్నలిస్టుకు ఉమ్మడి రాష్టంలో పత్రిక ప్రచురణ హక్కులను ఇస్తూ ‘ఫ్రాంచైజీ’ ప్రాతిపదికన అప్పగించినట్లు సమాచారం.

మాజీ సీఎం కేసీఆర్ తో కృష్ణప్రసాద్ (ఫైల్ ఫొటో)

ఈ నేపథ్యంలోనే ‘ది పయనీర్’ పత్రిక హైదరాబాద్, విజయవాడ ఎడిషన్లకు ప్రింటర్, పబ్లిషర్, రెసిడెంట్ ఎడిటర్ గా కృష్ణప్రసాద్ పేరు పత్రిక రెండో పేజీలో ‘ఇంప్రింట్’ నిబంధన కింద ఉండడం గమానార్హం. దీంతో ఈ రెండు ఎడిషన్లలో పనిచేసే స్థానిక సిబ్బందికి జీతభత్యాల చెల్లింపు అంశంలో కృష్ణప్రసాద్ కు మాత్రమే పూర్తి బాధ్యత ఉంటుందని చెప్పక తప్పదు. ఈమేరకు ‘ది పయనీర్’ పత్రిక అసలు యాజమాన్యానికి, ఫ్రాంచైజీ తీసుకుని పత్రికను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కృష్ణప్రసాద్ కు మధ్య ఒప్పందం ఉండి ఉంటుందని మీడియా వర్గాలు భావిస్తున్నాయి.

వికలాంగుల చట్టం హక్కు కమిషనర్ కు రాజ నర్సింగరావు చేసిన ఫిర్యాదు ప్రతి

దీంతో నర్సింగరావు అనే వ్యక్తి తనకు రావలసిన జీతం డబ్బు బకాయిల గురించి చేసిన ఫిర్యాదుపై భిన్నాభిప్రాయాుల వ్యక్తమవుతున్నాయి. దేశంలో ప్రముఖ పత్రికగా ప్రాచుర్యం గల ‘ది పయనీర్’ హైదరాబాద్, విజయవాడ ఎడిషన్లకు సంబంధించి పూర్తి బాధ్యుడు కృష్ణప్రసాద్ మాత్రమేనని మీడియా వర్గాలు ఉటంకిస్తున్నాయి. ఈ పరిణామాల్లో ‘ది పయనీర్’ పత్రికకు చెందిన అసలు యాజమాన్యం కృష్ణప్రసాద్ ద్వారా నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ వ్యవహారంలో ఏ విధంగా స్పందిస్తుందనే అంశంపైనా మీడియా వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Popular Articles