Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

‘కూసంపూడి నగల దుకాణం’లో భిన్న కోణం!

(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
‘శెర్ల బర్లను బెట్టి కొమ్ముల బేరం’ చేసినట్లు.. అనే సామెత గురించి తెలుసా? ఉత్తర తెలంగాణా జిల్లాల్లో ఈ నానుడి బాగా పాపులర్. చెరువులో గేదెలను ఉంచి, పైకి కనిపిస్తున్న వాటి కొమ్ములను మాత్రమే చూపుతూ క్రయ, విక్రయ ప్రక్రియలో బేరసారాలు నిర్వహించడమనేది ఆయా సామెత నిర్వచనం. అంటే.. చెరువులో కొమ్ములు మాత్రమే కనిపించేలా సేద తీరుతున్న గేదెల స్వరూపం ఎలా ఉందో తెలియకుండా వాటిని కొనుగోలు చేయడమన్నమాట. ఇప్పుడీ సామెత ప్రస్తావన ఎందుకంటే..? అర్ఎస్ఎస్ నేపథ్యం గల సత్తుపల్లి బీజేపీ నాయకుడు కూసంపూడి రవీంద్రకు సంబంధించిన ‘సిరిగోల్డ్’ సంస్థ వ్యవహారాలపై తవ్వినకొద్దీ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘కూసంపూడి’వారి వ్యాపార చరిత్రలో ఇది సరికొత్త కోణం అన్నమాట.

ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెడితే.. దేశం కోసం.. ధర్మం కోసం పరితపిస్తున్న బీజేపీలో సత్తుపల్లికి చెందిన కూసంపూడి రవీంద్ర వ్యాపార నేపథ్యం అత్యంత ఆసక్తికరం. సత్తుపల్లిలో ‘కూసంపూడి’ రవీంద్ర గతంలోనూ పలు వ్యాపారాలు నిర్వహించారు. ధనలక్ష్మి ఫైనాన్స్, సిరి జువెల్లర్స్ అనే వ్యాపార సంస్థలో ఆయన భాగస్వామి. తన సోదరునితో కలిసి ఆయా సంస్థల్లో వ్యాపారం చేశారు. తదనంతర పరిణామాల్లో తన సోదరునితో రవీంద్ర విడిపోయారు. పాతికేళ్లపాటు కలిసి వ్యాపారం నిర్వహించిన అన్నదమ్ములిద్దరూ విడిపోయారు. ఈ విషయాలను రవీంద్రనే స్వయంగా చెబుతున్నారు. అయితే ఆ రెండు సంస్థలు ఇప్పుడూ మనుగడలోనే ఉన్నాయని, కానీ వాటితో తనకెటువంటి వ్యాపార బంధం లేదని రవీంద్ర స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే తాను భాగస్వామిగా ఉన్నటువంటి ‘విహారి’ బ్రాండ్ దుస్తుల తయారీ ఫ్యాక్టరీని మూసేసినట్లు చెప్పారు. విహారి ఫ్యాక్టరీని తన భాగస్వామి అయినటువంటి మరో సోదరుడు చిలుకుర్తి రామారావు గుండెపోటుతో మరణించడంతో, నిర్వహించేవారులేక మూసేసినట్లు చెప్పారు. ‘విహారి’ కంపెనీలో ఎటువంటి నష్టాలు రాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. అదేవిధంగా సత్తుపల్లిలోని ‘సిరి జువెల్లర్స్’ లో రూ. మూడు కోట్ల చోరీ ఘటన కేసును పోలీసులు మూసేసిన అంశంపైనా రవీంద్ర స్పందించారు. సత్తుపల్లి బస్టాండ్ సమీపంలోని ‘సిరి’ జువెల్లర్స్ షాపులో 2014 మార్చి 8వతేదీన భారీ చోరీ జరిగింది. కానీ పోలీసులు మాత్రం 2018 జనవరి 2వ తేదీన ‘అన్ డిటెక్టెడ్’ ఘటనగా పేర్కొంటూ కేసును మూసేశారు.

వాస్తవానికి ఇటువంటి భారీ చోరీ ఘటనలను పోలీసులు మూసేయడమనేది సంచలనమే. ఎందుకంటే రూ. 5.00 లక్షలకు మించి దోపిడీ ఘటనల్లో ఐవో (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్)గా డీఎస్పీ స్థాయి అధికారి వ్యవహరిస్తారు. చోరీకి గురైన సొత్తు మొత్తం పెరిగినకొద్దీ ఐవో స్థాయి మారుతుంది. అదనపు ఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈ తరహా సంచలన ఘటనలపై దర్యాప్తు చేస్తుంటారు. అయితే ‘సిరి జువెల్లర్స్’ షాపులో రూ. 3.00 కోట్ల నగల చోరీ ఘటనను పోలీసులు UN (అన్ డిటెక్టెడ్) కింద పరిగణిస్తూ కేసును క్లోజ్ చేయడం వెనుక ఏదేని రాజకీయ ప్రమేయ ఉందా? అనే ప్రశ్నలు ఇప్పటికీ స్థానిక ప్రజల్లో చర్చగా మిగలడం విశేషం. అయితే ఈ కేసు మూసేయడంపై ‘సిరి జువెలర్స్’ యజమాని కూసంపూడి శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2019 ఫిబ్రవరిలో మీడియా సమావేశం నిర్వహించడం గమనార్హం.

ఈ అంశంపైనా కూసంపూడి రవీంద్ర మాట్లాడుతూ, ‘ఆ దొంగతనం జరిగడానికి ముందే నేను బయటకు వచ్చా.. ఏం జరిగిందో నాకు తెలియదు. చోరీ ఘటనకు ముందే మేం విడిపోయాం.. ఆ తర్వాత దోపిడీ సంఘటన జరిగింది. ప్రజా జీవితంలో గల నేను పోలీసులకు ఫిర్యాదు చేసే సందర్భంగా ఆ షాపు నిర్వాహకులకు తాను తోడు మాత్రమే వెళ్లాను’ అని పేర్కొన్నారు.

ఇక వర్తమానంలోకి వస్తే.. రవీంద్ర స్వయంగా చెబుతున్నట్లు తన సోదరునితో విడిపోయిన తర్వాత ‘సిరిగోల్డ్’ సంస్థను ప్రారంభించి వినూత్న తరహాలో ఆయన సరికొత్త వ్యాపారినికి శ్రీకారం చుట్టారు. అయితే ఏ వ్యాపారం నిర్వహణకైనా చిన్నదో, పెద్దదో షాపు ఏర్పాటు చేసిన తర్వాతే కార్యకలాపాలు ప్రారంభిస్తారు. కానీ ఇటు తెలంగాణాలోగాని, అటు ఆంధ్రప్రదేశ్ లో గాని ఎక్కడా షాపు ఏర్పాటు చేయకుండా, ‘గొలుసుకట్టు’ విధానంలో వివిధ ఆకర్షనీయ తాయిలాలతో గడచిన మూడేళ్లుగా ముందస్తు వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉండడం గమనార్హం. అంతేకాదు వివిధ పేర్లో కొందరి నుంచి డిపాజిట్టు వసూల్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ దిగువన గల ఓ వీడియోను చూడండి. సంస్థకు చెందిన కోర్ కమిటీ సభ్యుడు ‘బైనరీ నెట్ వర్క్ సిస్టమ్’ పేరుతో వసూళ్ల ప్రక్రియను గొలుసుకట్టు విధానంలో ఎంత విపులంగా వివరిస్తున్నాడో..? మాచింగ్ పెయిర్ టార్గెట్, ర్యాంక్స్, అవార్డుల పేరుతో వసూళ్ల విధానాన్ని చెప్పకనే చెబుతున్నాడు. క్రౌన్ డైమండ్ మర్చంట్ ర్యాంకర్ కు ఏకంగా రూ. 90.00 లక్షల మొత్తాన్ని ఆశగా చూపారు. ఇక గోవా, బ్యాంకాక్ ట్రిప్పులు కూడా ఇందులో ఉండడం గమనార్హం. ఇదిగాక రాయల్టీ ఇన్ కమ్ పేరుతో మరిన్ని తాయిలాలు ప్రకటించారు.

మొత్తంగా ఇటువంటి భిన్న పద్ధతుల్లో ఎక్కడా నగల షాపు ఏర్పాటు చేయకుండా రూ. 15.00 నుంచి 20.00 కోట్ల వరకు వసూళ్లు చేశారనేది సంస్థ బ్రోచర్ లో ‘డైరెక్టర్’గా పేర్కొన్న యాసా నాగేశ్వర్ రావు అనే వ్యక్తి సీసీఎస్ పోలీసులకు చేసిన ఫిర్యాదులోని అసలు పాయింట్. ఇతని ఫిర్యాదుపైనే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావుపైన, సత్తుపల్లి బీజేపీ నాయకుడు, సిరిగోల్డ్ సంస్థ సీఎండీ కూసంపూడి రవీంద్రపై నమ్మకద్రోహం, ఛీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తాము ఇప్పటి వరకు ‘గోల్డ్ పర్చేజ్’ స్కీం కింద నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు మాత్రమే వసూల్ చేశామని కూసంపూడి రవీంద్ర స్వయంగా అంగీకరించడం విశేషం.

ఇదే దశలో హైదరాబాద్ లో షాపు ఏర్పాటు చేయబోతున్నామని, విజయవాడ నగరంలో ఆఫీసు తెరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రవీంద్ర చెప్పారు. కానీ హైదరాబాద్ లోని తమ ఆఫీసులో నగల వ్యాపారం చేస్తున్నామని, షాపులేకుండా కూడా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు కూసంపూడి రవీంద్ర పేర్కొన్నారు. ఏపీలో కూడా తమ కార్యకలాపాలు సాగుతున్న మాట వాస్తవమేనని, ఒక వినూత్న తరహాలో తాము బంగారం వ్యాపారం చేయబోతున్నట్లు ఆయన ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా షాపులే లేకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వినూత్న తరహాలో గోల్డ్ పర్చేజ్ స్కీంల పేరుతో వసూళ్లు చేయడం బీజేపీ నాయకుడు రవీంద్ర చేస్తున్న వ్యాపార దక్షతకు నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఎల్జీ ఇండియా కేసులో ఛీటింగ్ బాగోతాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వివరించినప్పటి చిత్రం

కాగా ఇటువంటి ‘జాయినింగ్’ స్కీంలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఇటీవల ఏం చెప్పారో తెలుసా? ‘ఒకరిని జాయిన్ చేస్తే మీకు డబ్బులిస్తాం.. అని చెప్పే స్కీంలు మొత్తం స్కామే’ అని స్పష్టం చేశారు. ఎల్జీ ఇండియా అనే సంస్థ ఛీటింగ్ బాగోతంలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. స్కీంలు నిర్వహించే సంస్థలకు మంచి మంచి పేర్లు పెడతారని, జాయిన్ అయిన ప్రతి వ్యక్తీ వివిధ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టి మోసపోతుంటారని ఆయన చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్పే మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంల మోసాలపై సాయి చైతన్య వంటి ఐపీఎస్ అధికారులే కాదు, వేర్వేరు సందర్భాల్లో మరెందరో పోలీసు అధికారులు కూడా పదే పదే ప్రజలకు చెబుతూనే ఉన్నారు.
(రిజర్వు బ్యాంకు అనుమతులు అవసరమే లేదు..ట! ‘సిరి గోల్డ్’ కథ అయిపోలేదు)

Popular Articles