Friday, March 6, 2026

Top 5 This Week

Related Posts

రామచందర్ రావు సీరియస్..! ఖమ్మం బీజేపీ అధ్యక్షునిపై వేటు!?

(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
ఖమ్మం బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావుకు పదవీ గండం పొంచి ఉందా? పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయనను తప్పించే అవకాశం ఉందా? ‘సిరి గోల్డ్’ వివాదాంశం నెల్లూరి కోటేశ్వర్ రావు పదవికి పెను ప్రమాదకరంగా మారిందా? ఈ నెలాఖరులోపే కోటేశ్వర్ రావును పదవి నుంచి తొలగించే ప్రక్రియ పార్టీలో అంతర్గతంగా జరుగుతోందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బుధవారంనాటి ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడడం వెనుక అసలు ఆంతర్యం ఇదేనా? ఇటువంటి అనేక ప్రశ్నలపై ఖమ్మం జిల్లా బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంతకీ రామచందర్ రావు ఖమ్మం జిల్లా పర్యటనను ఎందుకు వాయిదా వేసుకున్నారు..?

‘సిరి గోల్డ్’ అనే సంస్థ వివాదంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు కూరుకుపోయిన సంగతి తెలిసిందే. నెల్లూరి కోటేశ్వర్ రావుపైనేగాక, బీజేపీకి చెందిన సత్తుపల్లి నాయకుడు కూసంపూడి రవీంద్రపైన నమ్మకద్రోహం, ఛీటింగ్ సెక్షన్ల కింద హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఈనెల 20వ తేదీన కేసు నమోదు చేసిన ఘటన పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. బీఎన్ఎస్ చట్టంలోని 316(2),318(4),r/w 3(5) సెక్షన్లతోపాటు 5 TSPDFEA,3,4,5 PC&MCSBA చట్టం కింద కోటేశ్వర్ రావు,రవీంద్రలపై కేసు నమోదు చేశారు. కల్లూరు మండలం చిన్న కోరుకొండికి చెందిన యాసా నాగేశ్వర్ రావు అనే వ్యక్తి ఇచ్చి ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో A1గా సత్తుపల్లికి చెందిన బీజేపీ నేత కూసంపూడి రవీంద్రను, A2గా ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావును పొందుపరుస్తూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు జిల్లాకు చెందిన బీజేపీ నాయకుల నుంచి, ముఖ్య శ్రేణుల నుంచి సమాచార సేకరణ జరిపారు. విషయంపై తనకు అందిన సమాచారంతో ఓ అవగాహనకు వచ్చిన రామచందర్ రావు సిరిగోల్డ్ వివాదం, కేసు నమోదు, పార్టీపై దాని ప్రభావం, తీవ్రత వంటి అంశాల్లో ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బుధవారంనాటి ఖమ్మం జిల్లా పర్యటనకు రామచందర్ రావు విముఖతను ప్రదర్శించినట్లు సమాచారం. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చోటు చేసుకున్న సిరిగోల్డ్ వివాదంలో ఏకంగా జిల్లా అధ్యక్షునిపైనే నమ్మకద్రోహం, ఛీటింగ్ కేసు నమోదు పరిణామాలపై ఆయన సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

తల్లాడలో రామచందర్ రావు ఆవిష్కరించాల్సిన దివంగత మాజీ ప్రధాని వాజపేయి విగ్రహం

వాస్తవానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనకు రావలసి ఉంది. తల్లాడ మండల కేంద్రంలో, సత్తుపల్లిలో ఏర్పాటు చేయనున్న దివంగత మాజీ ప్రధాని వాజపేయి విగ్రహాలను ఆయన ఆవిష్కరించాల్సి ఉంది. సత్తుపల్లిలో విగ్రహావిష్కరణ తేదీ ఖరారు కాకపోయినా, తల్లాడలో మాత్రం బుధవారం వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ‘సిరి గోల్డ్’ సంస్థ వివాదం, సీసీఎస్ పోలీసుల కేసు నమోదు పరిణామాలు వెలుగు చూశాయి. దీంతో రామచందర్ రావు ఖమ్మం జిల్లా పర్యటనను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఖమ్మం జిల్లాలో పర్యటిస్తే, నమ్మకద్రోహం, ఛీటింగ్ సెక్షన్ల కింద జిల్లా అధ్యక్షునిపై నమోదైన కేసు గురించి మీడియా అడిగే ప్రశ్నలపై ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది.

మొత్తంగా సిరిగోల్డ్ వివాదానికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావుపై నమోదైన కేసు విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుని హోదాలో గల నాయకుడేగాక, పార్టీకే చెందిన ఇతరులు కొందరు సైతం సిరిగోల్డ్ వివాదంలో వార్తల్లోకి రావడాన్ని రామచందర్ రావు తీవ్రంగా పరిగణిస్తున్నారట. ఈ పరిణామం డిసెంబర్ నెలాఖరులోపే నెల్లూరి కోటేశ్వర్ రావు పదవీచ్యుతుడు కావడానికి దారి తీయవచ్చనే ప్రచారం బీజేపీ శ్రేణుల్లోనే జోరుగా జరుగుతోంది. ఆ తర్వాతే రామచందర్ రావు ఖమ్మం జిల్లా పర్యటన ఖరారవుతుందని, తల్లాడ, సత్తుపల్లి కేంద్రాల్లో వాజపేయి విగ్రహాల ఆవిష్కరణలు జరుగుతాయంటున్నారు.

అయితే ఈ ప్రక్రియలో నెల్లూరి కోటేశ్వర్ రావు నుంచి పార్టీ రాష్ట్ర నాయకత్వం రాజీనామాను కోరుతుందా? లేక ఏకంగా పదవి నుంచి తొలగించి మరో వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారా? అనే ప్రశ్నలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమ్యూనిస్టుల ప్రభావంగల ఖమ్మంలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవీ బాధ్యతల్లో గల నాయకుడిపై నమ్మకద్రోహం, ఛీటింగ్ అభియోగాలపై కేసు నమోదైతే మున్ముందు పార్టీపై పడే ప్రభావాన్ని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. కొత్త సంవత్సరంలోపే నెల్లూరి కోటేశ్వర్ రావు పదవికి ముప్పు ఏర్పడితే అందుకు ఖచ్చితంగా ‘సిరిగోల్డ్’ వివాదమే ప్రధాన కారణమవుతుందనే అంశాన్ని పార్టీ వర్గాలు ఖరాఖండిగా చెబుతున్నాయి. చూడాలి ఏం జరగనుందో..!

Popular Articles