కొత్తగూడెం: బ్లాక్ మెయిల్ చర్యలతో వసూళ్ల దందాకు పాల్పడుతున్న ఓ పత్రికా విలేకరిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు నల్లా సురేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాల్వంచ పోలీసులు ఆదివారం రాత్రి ‘విజయక్రాంతి’ దిన పత్రిక విలేకరి గుమ్మడివెళ్లి వెంకట నరసింహారావుపై కేసు నమోదు చేశారు.
బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల్లోకి వెడితే.. పాల్వంచ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన నల్లా సురేష్ రెడ్డి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంటారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ ‘విజయక్రాంతి’ దిన పత్రిక విలేకరి గుమ్మడివెళ్లి నరసింహారావు అనేక నిరాధారమైన, తప్పుడు వార్తలు ప్రచురిస్తూ, తన పరువుకు నష్టం కలిగిస్తూ, సమాజానికి తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు నిలిచిపోయేలా వ్యవహరించాడని సురేష్ రెడ్డి పేర్కొన్నారు.
తప్పుడు వార్తా కథనాలను ప్రచురిస్తూ, తనను బెదిరిస్తూ రూ. 15 లక్షలు ఇవ్వాలని నరసింహారావు డిమాండ్ చేశాడని తెలిపారు. ఈ అంశంలో తన వద్ద తాపీ మేస్త్రీగా పనిచేసే బాబూలాల్ తోనూ, తన సోదరుడు రామక్రిష్ణారెడ్డితోనూ నరసింహారావు సంప్రదింపులు చేసి, డబ్బు కోసం డిమాండ్ చేశాడని సురేష్ రెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఈ మొత్తం తతంగంలో బేరసారాలకు దిగిన విలేకరి చివరికి రూ. 6 లక్షలు ఇవ్వాలని బెదిరించాడని, భయాందోళనకు గురైన తన సోదరుడు దశలవారీగా రూ. లక్ష, రూ. 50 వేల చొప్పున మొత్తం రూ. 1.50 లక్షలు చెల్లించాడని, మిగతా రూ. 4.50 లక్షలు ఇవ్వాలని నరసింహారావు మానసికంగా వేధింపులకు పాల్పడ్డాడని అన్నారు.
ఇదీ చదవండి:
తనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తూ, సమాజంలో గౌరవప్రదరంగా జీవిస్తున్న తనను చంపేస్తానని బెదిరిస్తున్న విలేకరి నరసింహారావుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నల్లా సురేష్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విలేకరి తమ నుంచి డబ్బు వసూళ్లు చేసిన వ్యవహారానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ఫిర్యాదుతో జత చేస్తున్నట్లు సురేష్ రెడ్డి స్పస్టం చేశారు.

ఈమేరకు తమకు అందిన ఫిర్యాదుపై పాల్వంచ పోలీసులు క్రైం నెం. 434/2025 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 308 (5) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న భద్రాద్రి జిల్లా పోలీసులు లోతైన దర్యాప్తును చేస్తున్నట్లు సమాచారం. కేసులో నిందితుడైన విలేకరి నరసింహారావు బాధితుడు సురేష్ రెడ్డి సోదరుని ద్వారా వసూల్ చేసిన నగదు మొత్తం ఏ బ్యాంకు ఖాతాకు వెళ్లింది? అక్కడి నుంచి మరెవరి ఖాతాకు వెళ్లింది? ఆ ఖాతాదారులెవరనే అంశంపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ఘటనపై ‘సమీక్ష’ న్యూస్ నిన్న ‘ఇస్తావా? చస్తావా? పాల్వంచలో బ్లాక్ మెయిల్ విలేకరి దందా’ శీర్షికన వార్తా కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే.

