హైదరాబాద్: సెల్ ఫోన్ దొంగలు ఏకంగా ఓ డీసీపీపై దాడికి యత్నించారు. కత్తితో తనపై దాడికి దొంగలు యత్నించడంతో హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కింద పడిపోయారు. ఈ పరిణామాల్లో డీసీపీ చైతన్య కాల్పులు జరపడంతో పారిపోతున్న ఇద్దరు దొంగల్లో ఒకరు గాయపడగా, అతన్ని చికిత్స కోసం నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. చాదర్ ఘాట్ విక్టోరియా గ్రౌండ్ సమీపాన శనివారం సాయంత్రం జరిగిన ఈ కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరై తిరిగి వెడుతున్న క్రమంలో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను గుర్తించారు. దొంగలను పట్టుకునేందుకు డీసీపీ చైతన్యతోపాటు ఆయన గన్ మెన్ ప్రయత్నించారు. అయితే ఈ పరిణామాల్లో ఓ దొంగ కత్తితో డీసీపీ చైతన్యపై దాడికి తెగబడ్డాడు. దీంతో డీసీపీ చైతన్య కిందపడిపోయారు. డీసీపీ చైతన్య తేరుకుని పారిపోతున్న దొంగలపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఘటనలో ఓ దొంగ తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సౌత్, సెంట్రల్ జోన్ డీసీపీలు స్నేహా మెహ్రా, శిల్పావళి పరిశీలించారు.


