Top 5 This Week

Related Posts

ఖమ్మం పోలీసుల ‘ఇజ్జత్ కా సవాల్’ ఘటన ఇది!

ఔను.. ఖమ్మం పోలీసుల ‘ఇజ్జత్’ (పరువు) కా సవాల్ వంటి అంశమే ఇది. వాహన తనిఖీల సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని సమయంలో ఆయా వాహనపు తాళం చెవి తీసుకుంటుంటే, సార్.. అంటూ వాహనదారుడు చేయి అడ్డం పెట్టిన సందర్భాల్లో మా విధులకు ఆటంకం కలిగిస్తున్నావా? అని ఆగ్రహించే పోలీసులు నిన్న కొణిజర్ల మండల కేంద్రంలో జరిగిన ఉదంతంపై వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావు కల్పిస్తోంది. కొణిజర్లలోని గోపవరం పీఏసీఎస్ వద్ద ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు చెందిన ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ ఇంటలిజెన్స్ అధికారి ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి ధ్వంసం చేసిన ఘటనలో కొణిజర్ల పోలీసుల వ్యవహార తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎరువుల సరఫరా అంశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును ‘బద్నాం’ చేసే ప్రక్రియలో భాగంగా ఆయా టీవీ ఛానల్ రిపోర్టర్ రైతాంగాన్ని రెచ్చగొట్టారనే అభియోగాలు వచ్చాయి. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, రైతులను రెచ్చగొడుతున్న రిపోర్టర్ ను వారించబోయిన ఇంటెలిజెన్స్ విభాగపు అధికారి మొబైల్ ఫోన్ ను లాక్కుని ధ్వంసం చేశాడు ఆ ఛానల్ రిపోర్టర్. అయితే ఈ అంశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావునే ‘బద్నాం’ చేసేందుకు స్కెచ్ వేసినట్లు పేర్కొంటున్న రిపోర్టర్ ను రక్షించేందుకు తుమ్మల శిబిరంలోని ఆయన ముఖ్య అనుచరులే కొందరు ప్రయత్నం చేశారనే విమర్శలు వచ్చాయి. ఈ యత్నం ఇంకా కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తోంది.

ఇంటెలిజెన్స్ అధికారి ఫోన్ ను లాక్కుని నేలకేసి కొట్టిన సమయంలోని దృశ్యాలు (వీడియో కాప్చర్ ఫొటోలు)

ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ అధికారి ఫోన్ ను ధ్వసం చేసిన ఘటనపై ఓ రైతు ద్వారా కొణిజర్ల పోలీసులకు గత రాత్రి ఫిర్యాదు అందినట్లు సమాచారం. దీంతో పీఏసీఎస్ వద్ద వీరంగం సృష్టించిన ఆయా రిపోర్టర్ పై కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేసు నమోదు అంశాన్ని కొణిజర్ల పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచుతున్న తీరుపై సహజమైన అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. రౌడీయిజానికి పాల్పడిన రిపోర్టర్ పై కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, సమాచారాన్ని ధ్రువపర్చుకునేందుకు మీడియా ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ అంశంలో కొణిజర్ల పోలీసులు గుట్టుగా వ్యవహరిస్తుండడంపై పోలీసు వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదైన విషయం వాస్తవమే అయితే వివరాలు వెల్లడించడం, లేదంటే తమకు ఘటనపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని, కేసు నమోదు చేయలేదని చెప్పకుండా కొణిజర్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావు కల్పిస్తోంది.

పరారీలో ‘రౌడీ’ రిపోర్టర్?
ఇదిలా ఉండగా కొణిజర్లలోని గోపవరం పీఏసీఎస్ ముందు రైతుల సమక్షంలోనే ఇంటెలిజెన్స్ అధికారి ఫోన్ ను ధ్వసం చేసిన ఛానల్ రిపోర్టర్ తనపై కేసు నమోదైన విషయం తెలుసుకుని ఖమ్మం నుంచి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసు విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారి ఫోన్ ను ధ్వంసం చేసి జిల్లా పోలీస్ యంత్రాంగానికే సవాల్ విసురుతున్న చందంగా సదరు రిపోర్టర్ తన పరపతిని శక్తిమేరకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారి విధులకు భంగం కలిగించిన ఇటువంటి తీవ్ర ఘటనలో ఈ రౌడీ రిపోర్టర్ ను రక్షించేందుకు అతని ‘సిండికేట్’ టీంలో గల ఓ ప్రముఖ పత్రిక జిల్లా రిపోర్టర్ తోపాటు మరో పత్రికకు చెందిన విలేకరి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రౌడీయిజానికి పాల్పడి విధుల్లో గల ఇంటెలిజెన్స్ అధికారి ఫోన్ ను ధ్వంసం చేసిన ఘటనలో జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకునే చర్యలపై సహజంగానే ఉత్కంఠ ఏర్పడింది.

Popular Articles