Top 5 This Week

Related Posts

రేవంత్ సర్కారు కోర్టులోకి ‘మావోయిస్టు’ల బంతి!

నిషేధిత మావోయిస్టు పార్టీ తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు కీలక ప్రతిపాదనను తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. సింపుల్ గా చెప్పాలంటే శాంతి చర్చల అంశంలో భాగమైన ‘కాల్పుల విరమణ’ బంతిని మావోయిస్టు పార్టీ రేవంత్ సర్కార్ కోర్టులోకి విసిరింది. ఈ అంశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూనే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రాష్ట్ర పర్యటన నేపథ్యంలో గుర్తు చేస్తుండడం గమనార్హం. ఖర్గే తెలంగాణాకు పర్యటనకు వచ్చిన తాజా పరిస్థితుల్లోనే మావోయిస్టు పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పెను సవాల్ ను ఉంచిందనే చెప్పాలి. విషయంలోకి వెడితే..

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ఉనికికే ప్రశ్నార్థక పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రతిన ప్రకారం వచ్చే మార్చి నెలాఖరుకల్లా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ‘ఆపరేషన్ కగార్’ చర్యలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే మావోయిస్టు పార్టీకి చెందిన అనేక మంది అగ్రనేతలు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదలైంది. తెలంగాణాలో అధికారంలో గల కాంగ్రెస్ ప్రభుత్వం ముందు అభయ్ చేసిన ప్రతిపాదన విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లోనే కాదు, రాజకీయ పరిశీలకుల్లోనూ ఇప్పుడు హాట్ టాపిక్. తన మూడు పేజీల ప్రకటనలోని ముఖ్య సారాంశం ప్రకారం మావోయిస్టు నేత అభయ్ ఏమంటారంటే..?

అంతేకాదు వివిధ ఘటనలను, భారీ ఎన్కౌంటర్ ఉదంతాలను ప్రస్తావించారు. దేశంలోని ఎంతో మంది మేధావులు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్నాయని, అందుకోసం డిమాండ్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్ వంటి ముఖ్యుల నాయకత్వంలో శాంతి చర్చల కమిటీ తెలంగాణా ముఖ్యమంత్రిని కూడా కలిసి కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలు జరపాలని కోరారని అభయ్ పేర్కొన్నారు. అనంతరం ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను కూడా కలిసి తెలంగాణా ప్రభుత్వంతో కాల్పుల విరమణను ప్రకటింపజేసి, శాంతి చర్చలకోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారని పేర్కొన్నారు.

తెలంగాణాలో బీజేపీ మినహా అన్ని పార్టీలు ముక్త కంఠంతో కాల్పుల విరమణను ప్రకటించి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయని, శాంతిచర్చల అంశంపై అమిత్ షా ప్రకటనను ఖండిస్తూ తెలంగాణా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందనను ప్రస్తావించారు. ‘పాకిస్థాన్’తో చర్చలు జరపగా లేనిది, మనదేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపడంలో తప్పేముంది? అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తమ వైఖరికి దృఢంగా కట్టుబడి ఉండడాన్ని స్వాగతిస్తున్నట్లు మావోయిస్టు నేత అభయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికీ ‘కాల్పుల విరమణ’ను ప్రకటించలేదని, ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాలను కాల్పుల విరమణ కోసం కోరడం నైతికంగా బలం సమకూర్చదని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ వ్యాఖ్యానించడం గమనార్హం. అందువల్ల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అధికారికంగా కాల్పుల విరమణను ప్రకటించాలని తాము కోరుతున్నట్లు అభయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణకు వస్తున్న సందర్భంలో ఇక్కడి పార్టీ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించేలా చొరవ చూపాలని ఆయన కోరారు.

మల్లిఖార్జున ఖర్గే

మొత్తంగా ఈ లేఖను పరిశీలించినపుడు మావోయిస్టు అగ్రనేత కాల్పుల విరమణ అంశాన్ని రేవంత్ సర్కార్ కోర్టులోకే నెట్టారు. ముందు తెలంగాణా ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలే కాదు, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశమే అసలు చర్చకు దారి తీసింది. ఎందుకంటే గత నెల 29వ తేదీన నిజామాబాద్ పర్యటనలో కేంద్ర హోం మంత్రి ఏమన్నారో గుర్తుందిగా..? తెలంగాణాను నక్సలైట్లకు అడ్డాగా మార్చవద్దు.. అని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కొందరు కాంగ్రెస్ వాళ్లు శాంతి చర్చలు అంటున్నారని కూడా అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇదే దశలో ‘మీరు ప్రతిపాదించిన శాంతి చర్చల’ ప్రకారమే ముందు తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించాలని అభయ్ తన తాజా లేఖలో కోరుతున్నారు. ఈ అంశంలో మధ్యాహ్నం జరిగే ‘కాంగ్రెస్ సామాజిక న్యాయభేరి సభ’లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారా? అనేది మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే!

Popular Articles