Top 5 This Week

Related Posts

మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ కు నిధులు విడుదల

మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ కు ప్రభుత్వం రూ. 162.54 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈమేరకు ఉత్తర్వును కూడా జారీ చేసింది. వృధాగా సముద్రంలోకి వెళ్తున్న మున్నేరు వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్ కు మళ్లించడానికి ఈ మొత్తం నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

సముద్రంలోకి పోయే వరద నీటిని రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా మళ్లించాలన్న ఆలోచన ఈ రాష్ట్రాన్ని పదేళ్లు ఏలిన ప్రభుత్వానికి రాలేదని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల వృధాగా పోతున్న వరద నీటిలో సుమారు 10 టీఎంసీల నీటిని పాలేరు రిజర్వాయర్ కు మళ్లించవచ్చన్నారు. దీనివల్ల ఈ రిజర్వాయర్ పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, ఇందులో ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

పాలేరు లింక్ కెనాల్ కు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొంగులేటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు తాగునీరు, డోర్నకల్ నియోజకవర్గం పరిధిలో పది చెరువులకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఏటా వర్షాకాలంలో వస్తున్న వరద నీరు వృధా కాకుండా ఒడిసి పట్టాలనే సంకల్పంతో మున్నేరు నుంచి పాలేరుకు లింక్ కెనాల్ ను నిధులు మంజూరు చేయించామని, నిర్దేశించిన గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Popular Articles