Top 5 This Week

Related Posts

‘ఒంటరి’ అయిన ఖమ్మం ఎంపీ!?

రామసహాయం రఘురాంరెడ్డి.. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సభ్యునిగా రికార్డు స్థాయి ఆధిక్యతతో చరిత్రాత్మక విజయం సాధించిన నిఖార్సయిన కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు. గత పార్లమెంటు ఎన్నికల్లో తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావుపై అక్షరాల నాలుగు లక్షల అరవై ఏడువేల ఎనిమిది వందల నలబై ఏడు (4.67 లక్షలు) ఓట్ల ఆధిక్యంతో ఎంపీగా ఎన్నికైన రఘురాంరెడ్డిని కాంగ్రెస్ వర్గీయులు RRR గానూ పిల్చుకుంటుంటారు.

కాంగ్రెస్ పార్టీతో తిరుగులేని అనుంబంధాన్ని పెనవేసుకున్న వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడే రఘురాంరెడ్డి అనే విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రఘురాంరెడ్డి స్వయానా వియ్యంకుడనే విషయం కూడా విదితమే. రాజకీయంగా ఎటువంటి అవినీతి మచ్చలేని ‘రామసహాయం’ కుటుంబానికి చెందిన రఘురాంరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే పాలేరు నియోజకవర్గానికి ‘బాహుబలి’ అవుతారని కూడా వార్తా కథనాలు రాశాను. నా అంచనాకు తీసిపోని విధంగా గత పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీని సాధించిన రఘురాంరెడ్డి పొలిటికల్ బాహుబలిగా నిరూపించుకున్నారనేది సుస్పష్టం.

నిజానికి రాజకీయంగానేకాదు, వ్యక్తిత్వపరంగానూ వేలెత్తి చూపలేని నిష్కలంక చరిత్ర గల రఘురాంరెడ్డి ఎంపీగా ఎన్నికైన ఏడాది కాలంలో తొలిసారి నిన్న మీడియాతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురాంరెడ్డి తన రాజకీయ నేపథ్యాన్ని వివరించారు. తాను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడినని, తాను ఏ పార్టీకీ వెళ్లలేదన్నారు. తనకు 35 ఏళ్ల క్రితం డోర్నకల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు 1989లో కాంగ్రెస్ బీ. ఫారం ఇచ్చారని చెప్పారు. అయితే పార్టీకి నువ్వు పని చేస్తున్నప్పటికీ, నీకంటే ఎక్కువగా పనిచేస్తున్న నూకల నరేష్ రెడ్డి, రెడ్యానాయక్ లు ఉన్నారని, వాళ్లకే ఛాన్స్ ఇవ్వాలని చెప్పిన తన తండ్రి మాటకు కట్టుబడి పక్కకు జరిగినట్లు తెలిపారు. అప్పటి నుంచి పార్టీకోసం పనిచేస్తున్నానని, 2009, 2014లో పార్టీ టికెట్ అడిగానని, కాంగ్రెస్ తనకు టికెట్ ఇవ్వలేదని చెప్పారు. అదేవిధంగా 2019లో కూడా నిలబడాలని ప్రయత్నించానని, అయితే నరేష్ రెడ్డి తమ ఇంటికి వచ్చి తుమ్మల నాగేశ్వర్ రావు నిలబడుతున్నారని చెప్పారని, తుమ్మల తమ కుటుంబానికి దగ్గరి వ్యక్తి కావడంతో వదిలేశానని చెప్పారు. అదేవిధంగా 2014లో తన పేరును రాజ్యసభకు ప్రతిపాదించగా, అప్పుడు కూడా ఇవ్వలేదన్నారు. అప్పుడే ఎమ్మెల్సీగా ప్రయత్నించినా ఫలితం లభించలేదన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి 2023లో తమ ఇంటికి వచ్చి పాలకుర్తి నుంచి పోటీ చేయాలని కోరారని, కానీ తనకు రాజకీయాలు వద్దని నిరాకరించినట్లు చెప్పారు. ఖమ్మం నుంచి 2024 ఎంపీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినందుకు రాహుల్ గాంధీకి, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కూడా రఘురాంరెడ్డి చెప్పారు. ఇదే సందర్భంలో తనను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం పార్లమెంటులో తాను నిర్వర్తించిన బాధ్యతను కూడా ఆయన వివరించారు.

ఆదివారం మీడియా ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి

ఇదంతా ఒక ఎత్తయితే.. ఎంపీ రఘురాంరెడ్డి మీడియాతో ఆత్మీయ సమావేశాన్ని ‘ఒంటరి’గా నిర్వహించడమే రాజకీయ చర్చకు దారి తీసింది. ఎంపీగా ఎన్నికైన తర్వాత రఘురాంరెడ్డి మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వేర్వేరు సందర్భాల్లో విలేకరులతో మాట్లాడడం వేరు, కానీ తానే స్వయంగా విలేకరుల ఆత్మీయతను ఆకాంక్షిస్తూ ఆహ్వానించిన సందర్భంగా మాత్రం ఏడాదిలో ఇదే ఫస్ట్ టైమ్. ఈ సందర్భంగా ఎంపీ రఘురాంరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నపుడు ఒకే ఒక్కడిగా కనిపించిన ‘ఒంటరి’ దృశ్యమే రాజకీయంగా భిన్న చర్చకు ఆస్కారం కలిగించింది.

నిజానికి రఘురాంరెడ్డి నిర్వహించిన మీడియా ఆత్మీయ సమావేశపు వేదికపై ఆయన సిబ్బంది మూడు కుర్చీలు ఏర్పాటు చేశారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వర్ రావులు హాజరై ఎంపీకి ఇరువైపులా కూర్చుంటారని సమాచారం అందింది. ఈ ఇద్దరికోసం వేచి చూసిన ఎంపీ రఘురాంరెడ్డి దాదాపు గంటన్నర ఆలస్యంగా ఆత్మీయ సమావేశాన్ని ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావలసిన మీడియా మీట్ పగలు 12.30 ప్రాాంతంలో మొదలు కావడం గమనార్హం. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వర్ రావులు ఎంపీ కార్యక్రమానికి గైర్హాజరు కావడంతో, గత్యంతరం లేక వేదికపై రెండు కుర్చీలను తొలగించి రఘురాంరెడ్డి ఒంటరిగానే ఆత్మీయ సమావేశాన్ని ముగించారు.

ఖమ్మం నగర అభివృద్దిపై మంత్రి తుమ్మల శనివారం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఎంపీ రఘురాంరెడ్డి (ఎడమ వైపు)

ఇదే సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎంపీ రఘురాంరెడ్డి చెప్పిన జవాబులు కూడా రాజకీయ చర్చకు దారి తీయడం గమనార్హం. తనకు ముగ్గురు మంత్రులతోనే కాదు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎవరితోనూ విభేదాలు లేవని ఎంపీ చెప్పారు. అంతేకాదు తాను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతోనే కలిసి ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. తన వియ్యంకుడైన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఏడాది కాలంలో రెండుసార్లు మాత్రమే కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎంపీ రఘురాంరెడ్డి ఆయా సమాధానాలను చెప్పారు.

మొత్తం పరిశీలించినపుడు ఓ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు మీడియాతో నిర్వహించిన సమావేశంలో ‘ఒక్కడి’గానే కనిపించడమే ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా ఎంపీ రఘురాంరెడ్డి వెంట ఆయన పీఎస్ చారి, పీఆర్వో ఇబ్రహీం, ఇద్దరు గన్ మెన్లతోపాటు ఎంపీని నిత్యం అనుసరించే కొప్పుల చంద్రశేఖర్ అనే వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఈ దృశ్యమే ఖమ్మం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన జిల్లాగా ప్రాచుర్యం పొందిన ఖమ్మంలో ఎంపీ పాల్గొన్న కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు మొహం చాటేయడం వెనుక గల కారణాలేమిటన్నదే ఆ చర్చ.

సీఎం రేవంత్ రెడ్డితో వరుసగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి, మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి (ఫైల్ ఫొటో)

వాస్తవానికి ఎంపీ రఘురాంరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించింది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా కాదు.. ఖమ్మం నగరం నడిబొడ్డున., విశాలమైన బైపాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో. తమ కుటుంబానికి దగ్గరి వ్యక్తిగా ఎంపీ వెల్లడించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆయన వర్గీయులు కూడా ఎవరూ రాలేదు. అదేవిధంగా తన వియ్యంకుడు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుయాయులు, అనుచరగణానికి చెందినవారెవరూ కనిపించలేదు. ఇకపోతే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వర్గీయులైన డీసీసీ అధ్యక్షుడు, గిడ్డంగుల సంస్థ చైర్మెన్ ఎంపీ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు.

సాధారణంగా ఓ డివిజన్ స్థాయి మున్సిపల్ కార్పొరేటర్ ఏదేని పెళ్లికి, పేరంటానికి వెడితేనే చుట్టూ మందీ, మార్బలపు అనుచరగణంతో హడావిడి చేస్తుంటారు. కానీ ఓ ఎంపీ నిర్వహించిన ప్రెస్ మీట్ లాంటి ఆత్మయ సమావేశానికి ముగ్గురు మంత్రులకు చెందిన వర్గీయులే కాదు, కనీసం నగర కాంగ్రెస్ శ్రేణులు సైతం దరిదాపుల్లో లేకపోవడమే రాజకీయ చర్చకు ఆస్కారం కల్పించింది. గమనించాల్సిన అంశమేమిటంటే.. కోట్ల రూపాయల వ్యాపార, ప్రాపర్టీ సామ్రాజ్య కుటుంబానికి చెందిన ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి అత్యంత నిరాండంబరంగా ఉంటారు. హడావిడి, డాబూ, దర్పం ప్రదర్శించే నాయకుడు కాదు. ఈ నేపథ్యంలో మీడియా ఆత్మీయ సమావేశానికి ఎంపీ రఘురాంరెడ్డే ఎవరినీ పిలవలేదా? లేక పిలిచినా కాంగ్రెస్ కేడర్ మొహం చాటేసిందా? అనేదే అసలు ప్రశ్నగా చర్చ సాగుతోంది.

మధిరలో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి వెంట కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అద్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ (బ్లూ షర్ట్ ధరించిన వ్యక్తికి, భట్టికి మధ్య)

టోటల్ ఎపిసోడ్ లో కొసమెరుపు ఏమిటంటే.. మీడియాతో ఆత్మీయ సమావేశం ముగిన తర్వాత డిప్యూటీ సీఎం వర్గీయులుగా ప్రాచర్యంలో గల వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వర్ రావులు ఎంపీ రఘురాంరెడ్డిని ఆయన నివాసంలో కలిసి కాసేపు చర్చలు జరపడం.

Popular Articles