Top 5 This Week

Related Posts

బ్రోకర్ విలేకరి.. అవినీతి సీఐ

లంచం కేసులో ఓ న్యూస్ ఛానల్ విలేకరి, పోలీస్ శాఖకు చెందిన సీఐ ఒకరు రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఏసీబీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మణుగూరు పోలీస్ స్టేషన్ లో బీఎన్ఎస్ చట్టంలోని 384(4), 329(3) సెక్షన్ల కింద నమోదైన క్రైం. నెం. 150/2025లో ఫిర్యాదుదారులైన మామ, అల్లుళ్లకు మేలు చేసేందుకు రూ. 4.00 లక్షల మొత్తాన్ని మణుగూరు సీఐ లంచంగా డిమాండ్ చేశారు. మణుగూరు సీఐ సోమ సతీష్ కుమార్ కోసం బిగ్ టీవీ విలేకరి మిట్టపల్లి గోపి మధ్యవర్తిగా వ్యవహరించి ఈ మొత్తాన్ని ఫిర్యాదుదారు నుంచి డిమాండ్ చేశాడు. ఈ మొత్తంలో దశలవారీ చెల్లింపులో భాగంగా లక్ష రూపాయల నగదును సోమవారం మధ్యాహ్నం 1.50 గంటలకు ఫిర్యాదుదారు బిగ్ టీవీ రిపోర్టర్ గోపికి ఇస్తుండగా ఏసీబీ అదికారులు వలపన్ని పట్టుకున్నారు.

మణుగూరు సీఐ సతీష్ కుమార్ ఆదేశం మేరకే బిగ్ టీవీ రిపోర్టర్ గోపి ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించి ఫిర్యాదుదారుని నుంచి లక్ష మొత్తాన్ని స్వీకరిస్తూ పట్టుబడినట్లు ఏసీబీ తెలిపింది. తమకు చిక్కిన బిగ్ టివీ రిపోర్టర్ గోపి వద్ద లభించిన నగదు మొత్తం, అతని వేలిముద్రలు రసాయనిక పరీక్షల్లో సరిపోల్చగా ధ్రువపడినట్లు ఏసీబీ వివరించింది.

ఈ ఘటనలో ఏ1గా ఉన్నటువంటి సీఐ సతీష్ కుమార్ ను, ఏ2గా ఉన్నటువంటి బిగ్ టీవీ విలేకరి మిట్టపల్లి గోపిని అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చినట్లు అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది. దర్యాప్తులో గల మొత్తం ఘటనకు సంబంధించి ఏసీబీ విడుదల చేసిన పత్రికా ప్రకటనను దిగువన చూడవచ్చు.

ఏసీబీ విడుదల చేసిన ప్రకటన

Popular Articles