తెలంగాణా డిప్యూటీ సీఎం గులాబీ పార్టీ నాయకులపై పరోక్షంగా సెటైర్లు విసిరారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఆ కొద్దిమంది రాజకీయ నాయకులకే ఉద్యోగాలు వచ్చాయి తప్ప, గత పదేళ్లలో రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఫలితాలు సాధించలేకపోయారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మధిర మండల కేంద్రంలో నిర్వహించిన జాబ్ మేళాలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుందన్నారు. ఆ మేరకు రాష్ట్రంలో మూడు అంచెల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు.
మొదటగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. మొదటి సంవత్సరంలోనే 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోందన్నారు. రెండో దశలో ప్రపంచీకరణలో భాగంగా వచ్చిన మార్పుల మేరకు బహుళ జాతి సంస్థలకు రాష్ట్రంలో వనరులు ఏర్పాటు చేసి, ఆ సంస్థల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయమన్నారు. బహుళ జాతి సంస్థలను ఆకర్షించి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ లో పర్యటించి రూ. 1.80 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారని వివరించారు.

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడమే సీఎం జపాన్ఈ పర్యటనలో భాగమన్నారు. మూడవ దశలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రూ. 9,000 కోట్ల పెట్టుబడితో రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చామన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఎంపికైన వారందరికీ రాష్ట్రవ్యాప్తంగా నియామకపు మంజూరు లేఖలు పంపిణీ చేస్తామని వివరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయించామని భట్టి అన్నారు. అంతేగాక 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేలా మరో నాలెడ్జి సిటీని ఏర్పాటు చేస్తున్నామని భట్టి ప్రకటించారు.

చదువు పూర్తి చేసుకున్నవారు ఖాళీగా ఉండకుండా, సొంత ఆదాయంతో ముందడుగు వేసేందుకు జాబ్ మేళాలు ఉపయోగపడతాయని డిప్యూటీ సీఎం అన్నారు. ఇక్కడ ఉద్యోగం పొందిన వారు అక్కడే ఆగిపోకుండా ఇది మొదటి మెట్టుగా భావించి వచ్చిన జీతంతో నిరుద్యోగులు జీవితంలో పెట్టుకున్న గొప్ప లక్ష్యాలను సాధించాలని కోరారు. మధిరలో జాబ్ మేళా ద్వారా ఓకే రోజు 5,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. టెక్నికల్ స్కిల్స్ లేక ఉద్యోగాలు పొందలేకపోయిన వారికోసం రాష్ట్రంలోని 65 ఐటిఐ కళాశాలలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని తెలిపారు.

