కరీంనగర్: కరీంనగర్ లో దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. నగరంలోని పీఎంజే జువెల్లరీ షాపులో ఆదివారం ఉదయం దుండగులు ప్రవేశించి, తుపాకీ కాల్పులు జరపడం ద్వారా భారీ ఎత్తున నగల దోపిడీకి పాల్పడ్డారు. దొంగలు జరిపిన కాల్పుల్లో జువెల్లరీ షాపునకు చెందిన ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధవించి ప్రాథమిక సమాచారం ప్రకారం అందిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆరుగురు దోపిడీ దొంగల ముఠా ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలోనే కస్టమర్ల మాదిరిగా షాపులోకి ప్రవేశించారు. అనంతరం తుపాకీతో బెదిరిస్తూ నగలను చూపించాలని సిబ్బందిని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిబ్బందిని కట్టేసి, వారిపై కాల్పులు జరిపి భారీ ఎత్తున షాపులోని నగలను దోచుకుని పరారయ్యారు. రెండు బైకులపై వచ్చిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ఘటనా స్థలాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సందర్శించి, పరిశీలించారు. దుండగులు కాల్పులు జరిపిన సందర్భంగా లభ్యమైన తుపాకీ మ్యాగ్జిన్ ను, బుల్లెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన దుండగుల కోసం నాలుగు టీంలతో కూడిన పోలీసులు గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలను అధికారికంగా పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

