తన సస్పెన్షన్ అనంతరం ఇల్లెందు సీఐ బత్తుల సత్యనాారాయణ స్పందించారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్ఆర్ఐ నవీన్ రెడ్డి దంపతుల వివాదంలో నవీన్ రెడ్డి తల్లిదండ్రులపట్ల దురుసుగా ప్రవర్తించి , వారి హక్కులకు భంగం కలిగించినందుకు ఇల్లెందు సీఐగా పనిచేస్తున్న సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాయలం నుంచి బుధవారం ప్రకటన విడుదలైంది. ఈ పరిణామం అనంతరం వచ్చిన భిన్న వార్తా కథనాల నేపథ్యంలో సీఐ సత్యనారాయణ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రకటన ఇలా ఉంది.
‘‘పాత్రికేయ మిత్రులకు నమస్కారం..
భార్యభర్తల పంచాయితీలో నిన్న జరిగిన సంఘటనలో ఉన్నతాధికారులు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులు పూర్తిస్ధాయిలో విచారణ చేస్తున్నారు. నా సస్పెప్షన్ విషయంలో నేను ఎవరి వద్ద, పాత్రికేయుల వద్ద కూడా నా అభిప్రాయాన్ని తెలపలేదు. కాని పత్రికా మిత్రులు వారికి సొంతంగా అనిపించింది ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఆపాదించుకుంటున్నారు. దయచేసి నన్నుకాని, మా ఉన్నతాధికారులను ఉద్దేశించి ఎలాంటి వార్తలు రాయవద్దని మనవి చేస్తున్నాను. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు నేను ఉంటాను. కాని నా అభిప్రాయం లేకుండా, నా అనుమతి లేకుండా ఎలాంటి వార్తలు రాయవద్దని మనవి చేస్తున్నాను.’’
ఇట్లు
బత్తుల సత్యనారాయణ
సీఐ


