Top 5 This Week

Related Posts

మావో అగ్రనేత ‘మల్లోజుల’ ముందున్న ఆప్షన్లేమిటి!?

మల్లోజుల వేణుగోపాల్ @ అభయ్ @ సోను.. మావోయిస్ట్ అగ్రనేత మాత్రమే కాదు.. ఆ పార్టీలో అత్యంత కీలక నేత. పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుడు. దశాబ్ధాల అజ్ఞాతంలో జీవితాన్ని విప్లవ పంథాకే అంకితం చేసినట్లు విప్లవోద్యమాభిమానులు భావించే నాయకుడు. దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీపై ఏరోజుకారోజు పట్టు సాధిస్తున్న ప్రభుత్వ భద్రతా బలగాలు, ఆయుధాలు అప్పగించాలని, లేనిపక్షంలో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ చుట్టుముట్టి స్వాధీనం చేసుకుంటుందని పార్టీ నాయకత్వం హెచ్చరక జారీ చేసిన పరిణామాల మధ్య అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ముందున్న అవకాశాలేమిటి? ఇదీ విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లో జరుగున్న తాజా చర్చ.

ఇంతకీ మల్లోజుల వేణుగోపాల్ చేసిందేమిటి? శాంతి చర్చలకోసం ఆయుధాలు వదిలేస్తామంటూ ఆయన ఈనెల 15వ తేదీన సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మరో లేఖను విడుదల చేశారు. విప్లవోద్యమంలో ప్రజలకు కలిగిన నష్టాలకు, భరించిన కష్టాలకు, జనం చేసిన అసమాన, అనుపమాన త్యాగాలకు తామే బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. తమ మిడిమిడి జ్ఞానంతో, వస్తుగత పరిస్థితులను అర్థం చేసుకోవడంలో చేసిన పొరపాట్లకు, తమ ఆచరణలో అవలంభించిన అతివాద ఒంటెత్తువాద తప్పులకు తమను మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ కాలంలో జరిగిన తప్పులకు బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. తాము తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ చేయడాన్ని అర్థం చేసుకోవాలని, ఈ నిర్ణయం తీసుకోకుండా మిగిలిన విప్లవ శక్తులనైనా కాపాడుకోలేమన్నారు. ప్రజల త్యాగాలకు, అమరుల బలిదానాలకు న్యాయాన్ని చేకూర్చలేమని, ఈ ‘ఓటమి’ బాధాకరమైనదేనని అభయ్ మరో లేఖను విడుదల చేశారు.

ఇటీవల తన పత్రికా ప్రకటనలో అభయ్ తాజా ఫొటో

అభయ్ చేసిన ఈ ప్రకటనను మావోయిస్ట్ పార్టీ తోసిపుచ్చింది. ఆయుధాలు వదిలేస్తామంటూ, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పేరుతో సోను చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప, పార్టీ నిర్ణయం కాదని మావోయిస్ట్ పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో మరో ప్రకటన విడుదలైంది. అంతేకాదు అభయ్ తన వద్ద గల ఆయుధాలను పార్టీకి అప్పగించాలని, లేనిపక్షంలో పీఎల్జీఏ సభ్యులు స్వాధీనం చేసుకుంటారని కూడా పార్టీ హెచ్చరించింది. పార్టీకి చెందిన నాయకుల మధ్య పరస్పర భిన్నరీతుల్లో విడుదలైన ఈ ప్రకటనల నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీలో గందరగోళం నెలకొన్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను కోవర్టుగా మారాడనే సారాంశంతోనూ కొన్ని మీడియా సంస్థలు వార్తా కథనాలను ప్రచురించాయి. ప్రభుత్వానికి అభయ్ లొంగిపోయే అవకాశాలున్నట్లు కూడా ఆయా వార్తా కథనాల సారాంశం. ఈ పరిణామాల్లోనే ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి, కట్టా రామంద్రారెడ్డిలు ఎన్కౌంటర్ లో మరణించారు.

తాను చేసిన ప్రకటనకు కౌంటర్ గా పార్టీ నేత జగన్ విడుదల చేసిన మరో స్టేట్మెంట్ పై అభయ్ ఇప్పటి వరకు ఇంకా ఎటువంటి స్పందనను వెల్లడించలేదు. దీంతో తాజా పరిణామాల్లో మావోయిస్ట్ పార్టీలో ఏం జరుగుతోందనే అంశంపై విప్లవ కార్యకలాపాల పరిశీలకులు భిన్న వాదనలు వినిపిస్తుండగా, ప్రభుత్వ నిఘా వర్గాలు మాత్రం మరింత లోతైన సమాచార సేకరణలో నిమగ్నమయ్యాయి. ఆయుధాలు వదిలేస్తామనే అభయ్ ప్రకటనను పార్టీ అతని వ్యక్తిగత అభిప్రాయంగా స్పష్టం చేసింది. అంతేకాదు అభయ్ వద్దగల ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని పీఎల్జీఏను ఆదేశించింది. అంటే అభయ్ ను పార్టీ వదిలేసినట్లుగానే విప్లవ కార్యకలాపాల పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని పీఎల్జీఏకు ఆదేశాలిచ్చిన ఘటనను అభయ్ పై పార్టీకిగల అభిప్రాయ తీవ్రతను స్పష్టం చేస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

ఎన్కౌంటర్ లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యులు కోసా@ సత్యనారాయణరెడ్డి, వికల్ప్@ రామచంద్రారెడ్డి (ఫైల్ ఫొటో)

ఈ నేపథ్యంలో పార్టీలో కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తదుపరి అడుగులపై సహజంగానే చర్చ జరుగుతోంది. ఇంతకీ అభయ్ ముందున్న అప్షన్లేమిటి? అనే ప్రశ్నపైనా భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవేమిటంటే..

నెంబర్ 1: తాజా పరిస్థితుల్లో ప్రభుత్వానికి లొంగిపోయే ఆలోచన అభయ్ కి లేకుంటే మాత్రం.. ఆయుధాలు వదిలేయాలనే తన వాదనకు మద్ధతునిచ్చే నాయకులను, కేడర్ ను కలుపుకుని పార్టీని చీల్చడం. తద్వారా మరో కొత్త గ్రూపును ఏర్పాటు చేయడం. విప్లవ పార్టీల్లో చీలికలు, కొత్త గ్రూపుల ఆవిర్భావం కొత్తేమీ కాదు. భారత కమ్యూనిస్టు పార్టీల విప్లవోద్యమ చరిత్రలో ఇటువంటి చీలికల పేజీలు అనేకంగా ఉన్నాయి. సీపీఐ(ఎంఎల్) ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, ప్రజాపంథా, మాస్ లైన్, జనశక్తి, సీపీయూఎస్ఐ, జనరక్షణ సమితి, రామచంద్రన్ వర్గం, ఫణిబాగ్చి వర్గం, పైలా వాసుదేవరావు వర్గం వంటి అనేక విప్లవ గ్రూపుల ఆవిర్భావం ‘చీలిక’ పరిణామాల ఫలితమే.

నెంబర్ 2: ఆయుధాలు వదిలేయాలనే తన వాదనకు మద్దతునిచ్చే నాయకులుగాని, కేడర్ గాని లేకుంటే, ఒంటరిగా మిగిలిన పరిస్థితి ఎదురైతే ప్రభుత్వానికి లొంగిపోవడం మినహా మరో మార్గం లేదు. ఇవి మాత్రమే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ముందున్న ఆప్షన్లని విప్లవోద్యమ కార్యకలాపాల పరిశీలకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు. పార్టీలో భిన్నవాదనల కారణంగా ఒంటరిగా మారిన కీలక నాయకులు పలువురు అనివార్యంగా ప్రభుత్వానికి లొంగిపోయిన ఘటనలూ విప్లవోద్యమ చరిత్రలో లేకపోలేదు. దీంతో ప్రస్తుత పరిణామాల్లో అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ఏ మార్గం వైపు పయనిస్తారనేది వేచి చూడాల్సిందే..!

Popular Articles