Top 5 This Week

Related Posts

‘వెలుగుమట్ల’ భూదాన్ కేసుల్లో నిందితుల వాహనాలు సీజ్

ఖమ్మం: వెలుగుమట్ల భూదాన్, ప్రభుత్వ భూముల పేరుతో వసూళ్లకు పాల్పడిన వ్యక్తుల స్థిర, చరాస్తుల జప్తునకు ఖమ్మం జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ ఘటనలో నిందితులైన వ్యక్తులకు చెందిన రూ. 45.00 లక్షల విలువైన ఐదు వాహనాలను సీజ్ చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం వెల్లడించారు. భూదాన్, ప్రభుత్వ భూముల దురాక్రమణకు పాల్పడి, పేద ప్రజల నుంచి అక్రమంగా డబ్బు వసూళ్లు చేసి కూడబెట్టుకున్న స్థిర, చరాస్తుల జప్తునకు చట్టపరమైన చర్యలు చేపట్టామని చెప్పారు.

వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్, ప్రభుత్వ భూముల్లో అక్రమ వ్యాపారాలకు, ఆక్రమణలకు పాల్పడిన నిందితులపై ఖానాపురం హవేలి, ఇతర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఆయా కేసుల విచారణలో భాగంగా ఖానాపురం హవేలి పోలీసులు ఏడుగురు నిందితులను కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో బల్లి శ్రీనివాస్ @ శ్రీను, పోలెబోయిన ముత్తయ్య, కొప్పెర వెంకన్న, తాళ్లూరి కృష్ణ, కుంజా కృష్ణయ్య @ కృష్ణ, కల్తీ రామ చంద్రయ్య, బాణాల లక్ష్మణాచారి ఉన్నారని చెప్పారు.

పోలీసులు సీజ్ చేసిన వెలుగుమట్ల కేసుల్లోని నిందితుల వాహనాలు

తమ విచారణలో ఆయా నిందితులు వెల్లడించిన వివరాలు ప్రకారం సుమారు 1,549 మంది పేద ప్రజల (బాధితుల) నుండి వసూలు చేసిన రూ. 2,88,38,100 మొత్తంలో కొంత కోర్టుకు ఖర్చులకు, ర్యాలీలు, సర్వేలు, భూదాన్ వినోబా నవోదయ కాలనీలో తాత్కాలికంగా నిర్మించుకున్న ఇండ్లకు కరెంటు, నీరు, మిగతా సౌకర్యాల పేరుతో ఖర్చు చేశారని తెలిపారు. మిగిలిన డబ్బును స్వప్రయజనాలకు, స్థిరాస్తుల సంపాదించుకోవడం కొరకు ఖర్చు పెట్టినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారని సీపీ తెలిపారు.

ఇందులో తాళ్లూరి కృష్ణ ఓ ట్రాక్టర్ ను కొనుగోలు చేశాడని, ఖమ్మం కవిరాజ్ నగర్ రోడ్ నెం. 1లో 64.54 చదరపు గజాల విస్తీర్ణంలో రూ. 19.90 లక్షలను ఖర్చు చేసి మొదటి, రెండో అంతస్తుల భవనం నిర్మించాడని తెలిపారు. అదేవిధంగా బాణాల లక్ష్మణాచారి అనే నిందితుడు హీరో డీలక్స్ మోటార్ సైకిల్ ను కొనుగోలు చేశాడని, పోలెబోయిన ముత్తయ్య టాటా మేజిక్, టాటా ఇంట్రా ట్రాలీ వాహనాలను కొనుగోలు చేశాడన్నారు. కొప్పెర వెంకన్న స్ప్లెండర్ మోటార్ సైకిల్ కొన్నాడని, చిప్పలపల్లి వీరయ్య రూ. 4.48 లక్షల నగదును, రూ. 10.00 లక్షల మొత్తాన్ని ఏన్కూరుకు చెందిన పొన్నెబోయిన బేబి వద్ద ఉంచాడని చెప్పారు.

అదేవిధంగా హుస్నాబాద్ పార్టీ మీటింగ్ కు రూ. 10.00 లక్షలు ఖర్చు చేశారని, ఇతర ఖర్చులకు, స్వప్రయోజనాలకు వసూల్ చేసిన డబ్బును వినియోగించినట్లు సీపీ పేర్కొన్నారు. మొత్తంగా రూ. 10.40 లక్షల విలువైన వాహనాలను, రూ. 19.90 లక్షల విలువైన ఇండ్లను, రూ. 10.00 లక్షల విలువైన ఇంటి స్థలాన్ని, బ్యాంక్ ఖాతాల్లో రూ. 4.48 లక్షల నగదు సహా మొత్తం రూ. 44.78 లక్షల ఆస్తులను వెలుగుమట్ల భూదాన్, ప్రభుత్వ భూముల దురాక్రమణ కేసుల్లో నిందితులు కలిగి ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీస్ కమిషనర్ వివరించారు.

ఆయా స్థిర, చరాస్తుల్లో ఐదు వాహనాలను సీజ్ చేశామని, మిగతా ఆస్తుల జప్తునకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వివరించారు.

Popular Articles