Top 5 This Week

Related Posts

బడ్జెట్ కు తగ్గ ఆదాయం ఎలా..? సీఎం రేవంత్ కీలక సమీక్ష

హైదరాబాద్: రాష్ట్ర ఆదాయం పెంపుదలపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా లక్ష్యాలను సాధించడానికి ఆదాయ సమీకరణపై కచ్చితంగా దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. లీకేజీలను అరికట్టి ఆదాయ సమీకరణకు సంబంధించి చేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆదాయ పెంపు అంశంలో అధికారులకు సీఎం పలు కీలక ఆదేశాలిచ్చారు. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్‌తో పాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలను పూర్తిగా అరికట్టాలన్నారు. ఆదాయ సమీకరణలో ఛేజింగ్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాల్సిందేనని అధికారులతో సీఎం స్పష్టం చేశారు.

అనుకున్న స్థాయిలో పనిచేయాలంటే శాఖలవారీగా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా శాఖలవారీగా బడ్జెట్‌ను తయారు చేసుకోవాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.

ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ ఊహాజనితం కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని, వాస్తవికత ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరగాలన్నారు. ఆయా శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Popular Articles