హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తాజాగా చోటు చేసుకున్న కీలక పరిణామం ఇది. ఈ కేసులో తెలంగాణా అవినీతి నిరోధక శాఖ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో మొదటి నిందితుని (A1) గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, రెండో నిందితుని (A2)గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను పొందుపరుస్తూ ఏసీబీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అదేవిధంగా A3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావును, A5గా యూకేకు చెందిన ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్థను పేర్కొన్నారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా రూ. 55.00 కోట్ల మొత్తాన్ని విదేశీ సంస్థలకు నేరుగా మళ్లించారనేది ఏసీబీ అభియోగం. మొత్తం వ్యవహారంలో ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు బాధ్యతల అప్పగింత, బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ. 45.00 కోట్లు రావడం క్విడ్ ప్రోకోలో భాగంగా ఏసీబీ తన ఛార్జిషీట్ లో ప్రస్తావించినట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 ఫిబ్రవరిలో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేస్ ఉదంతం అనేక మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. ఆయా పరిణామాల్లోనే ఏసీబీ తాజాగా ఛార్జిషీట్ ను దాఖలు చేయడం గమనార్హం.

