Top 5 This Week

Related Posts

59 జీవో దరఖాస్తుదారులకు శుభవార్త

ఖమ్మం: ప్రభుత్వ భూముల కబ్జా అంశంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి మండలం టాప్ లో నిలిచింది. ద్వితీయ స్థానాన్ని ఖమ్మం అర్బన్ మండలం దక్కించుకుంది. ఇక మూడో స్థానంలో పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం ఉంది. చివరి స్థానంలో బోనకల్ మండలం నిలిచింది. తెలంగాణా ప్రభుత్వం కల్పించిన జీఓ 59 వెసులుబాటు కింద ఈ భూముల క్రమబద్ధీకరణకు చర్యలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగానే వివిధ జిల్లాల కలెక్టర్లకు ఈ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.

దీంతో ఖమ్మం జిల్లాలోని 59 జీవో కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. అర్హులైన దరఖాస్తుదారులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 500 గజాల లోపు ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన జాబితా ప్రకారం ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న జీవో 59 దరఖాస్తుల విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 59 జీవో కింద పెండింగులో గల దరఖాస్తుల వివరాలను ప్రకటించారు.

మండలాల వారీగా కొణిజర్లలో 84, సింగరేణి 3, కామేపల్లి 8, వైరాలో 193, బోనకల్ 2, చింతకాని 151, ముదిగొండ 82, నేలకొండపల్లి 7, మధిర 206, ఎర్రుపాలెం 12, కల్లూరులో 213, పెనుబల్లి 216, తల్లాడ 39, తిరుమలాయపాలెంలో 79, వేంసూర్ 266, సత్తుపల్లిలో 1,662, ఖమ్మం అర్బన్ 1,255, ఖమ్మం రూరల్ 270, కూసుమంచి 445, రఘునాథపాలెంలో 212 దరఖాస్తులు వచ్చాయి.

ఈ దరఖాస్తుల విచారణను వేగవంతం చేసేందుకు మొత్తం 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ బృందాల్లో 17 మంది జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి, వారికి అవసరమైన శిక్షణ అందించిన అనంతరం దరఖాస్తుల విచారణ 30 రోజుల్లోగా చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం సంబంధిత జిల్లా అధికారులు వారికి కేటాయించిన దరఖాస్తులను పరిశీలిస్తూ విచారణ ప్రక్రియను కొనసాగిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.

59 జీవో కింద భూముల క్రమబద్ధీకరణకు చేసుకున్న దరఖాస్తుదారులు విచారణ సమయంలో సంబంధిత అధికారులకు అవసరమైన సమాచారం, పత్రాలు అందించి పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూములను క్రమబద్ధీకరించుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కోరారు.

Popular Articles