మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు లొంగుబాటుపై ఆ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఈమేరకు మావోయిస్ట్ పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదలైంది. దామోదర్ లొంగిపోతాడనే మీడియా ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పోలీసులే ఉద్ధేశపూర్వకంగా ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దామోదర్ లొంగిపోతున్నట్లు, ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు గతంలో కూడా అనేకసార్లు ప్రచారం చేశారన్నారు. విప్లవ ప్రజలను గందరగోళపరచడానికి మానసిక యుద్ధంలో భాగంగా ఈ దుష్ప్రచారం జరుగుతోందని జగన్ పేర్కొన్నారు.
కాగా తమ పార్టీ పేరుతో మంత్రి సీతక్కపై వచ్చిన ప్రకటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని జగన్ పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ అంశంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వైఖరిని వెల్లడైందని, ఆపరేషన్ కగార్ ను తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని ఆయన అన్నారు.


