హైదరాబాద్: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావులకు తెలంగాణా హైకోర్టులో భారీ ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు బుధవారం హైకోర్టు తీర్పునిచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినట్లు పేర్కొన్న అవకతవకలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఈమేరకు 2024 మార్చి 14వ తేదీన జారీ చేసిన నెం. 6 జీవోను సవాల్ చేస్తూ గులాబీ పార్టీ బాస్ కేసీఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సభర్వాల్, ఎస్కే జోషీలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ నిర్వహించింది.
ఈ అంశంలో హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించిన తీర్పుతో కేసీఆర్, హరీష్ రావులకు భారీ ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలను పాటించలేదని, ఈ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలకు ఉపక్రమించరాదని హైకోర్టు తన తీర్పులో నిర్దేశించింది.
