ఖమ్మం: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ శనివారం అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. ఓ బాధితుని ఇంటి నిర్మాణానికి నెంబర్ కేటాయించి అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేస్తూ సురేష్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి దొరికిపోయాడు. వివరాల్లోకి వెడితే..
బాణాపురం పంచాయతీ పరిధిలోని ఓ బాధితుడు తనకు గల ఐదు కుంటల స్థలంలో భవన నిర్మాణపు ప్రక్రియలో భాగంగా అనుమతి, ఇంటి నెంబర్ కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు, అధికారికంగా లబ్ధి చేకూర్చేందుకు బాధితుని నుంచి పంచాయతీ కార్యదర్శి సురేష్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
ఈమేరకు ఫిర్యాదుదారుడైన బాధితుని నుంచి పంచాయతీ కార్యదర్శి సురేష్ రూ. 25,000 మొత్తాన్ని రైతువేదిక వద్ద లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న ఆయా మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం కూడా చేసుకున్నారు. కాగా పంచాయతీ కార్యదర్శి సురేష్ ను అరెస్ట్ చేసి, వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ ప్రకటించింది.

