Top 5 This Week

Related Posts

రాజకీయ పార్టీలు సహకరించాలి: ‘ఎస్ఐఆర్’పై ఖమ్మం జిల్లా కలెక్టర్

ఖమ్మం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కోరారు. జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో రానున్న 30 రోజులలో ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, వాటిని తిరిగి స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో టామ్‌ టామ్ నిర్వహించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్లు ఇంటి వద్ద అందుబాటులో ఉండి తమ వివరాలను సక్రమంగా అందించాలని కోరారు.

అన్‌మ్యాప్డ్ ఓటర్లు నిర్దేశించిన 11 ధృవ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలన్నారు. జిల్లాలో గుర్తించిన ఎక్కువ శాతం అనామలీలను ఇప్పటికే పరిష్కరించినట్లు చెప్పారు. అవసరమైన పత్రాలు సమర్పించిన వారికి తక్కువ సమయంలోనే దరఖాస్తుల పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) వివరాలను వెంటనే అందజేయాలని సూచించారు. ప్రతి అర్హమైన ఓటరు ఓటు హక్కు కొనసాగేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ప్రతి బీఎల్‌ఏ తమ రాజకీయ పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డు కలిగి ఉండాలని స్పష్టం చేశారు.

ముసాయిదా ఓటరు జాబితాలో ఎవరి పేరు లేకపోయినా తప్పనిసరిగా అభ్యంతరం నమోదు చేయాలని, అభ్యంతరం నమోదు చేయకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం కోసం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజల సహకారం అత్యంత అవసరమని అన్నారు. బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేసి సమస్యలు, సందేహాలను వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైన చోట్ల బీఎల్‌వోలకు సహాయక సిబ్బందిని కూడా నియమించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిటి అన్సారీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఏ. గోపాల్ రావు, బిజెపి పార్టీ ప్రతినిధులు వి. రాజేష్, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు బెల్లం వేణుగోపాల్, బి. జసవంత్, లింగనబోయిన సతీష్ బాబు, మంకన రమేష్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి పి. నర్సింహారావు, టిడిపి పార్టీ ప్రతినిధి పాలడుగు టిఆర్ కృష్ణ ప్రసాద్, సిపిఐ ఎం పార్టీ ప్రతినిధులు ఎస్. నవీన్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Popular Articles