Top 5 This Week

Related Posts

ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వుకు ‘పొలిటికల్ బ్రేక్’

ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఓ బదిలీ ఉత్తర్వుకు ‘పొలిటికల్’ బ్రేక్ పడింది. ఫలితంగా ఆయన జారీ చేసిన ఉత్తర్వు అమలు కాకుండా రాజకీయ ఒత్తిడి నిలువరించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత జరిగిన మున్సిపల్ శానిటరీ జవాన్ల బదిలీ ఉత్తర్వు అమలు కాకుండా ‘రాజకీయ ఒత్తిడి’ నిలువరించిన అంశం తీవ్ర చర్చకు దారి తీసింది.

ఖమ్మం నగరంలోని పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న 62 మంది జవాన్లను బదిలీ చేస్తూ మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మూడు రోజుల క్రితం.. గత నెల 30వ తేదీన ఉత్తర్వు జారీ చేశారు. బదిలీకి గురైన వారిలో పర్మినెంట్, కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న జవాన్లు ఉన్నారు. పారిశుధ్య నిర్వహణను క్రమబద్ధీకరించే ప్రక్రియలో భాగంగా మున్సిపల్ జవాన్లను అంతర్గత బదిలీలు చేస్తున్నట్లు కమిషనర్ తన ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వు వెంటనే అమలులోకి వస్తుందని కూడా కమిషనర్ పేర్కొన్నారు.

ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య (ఫైల్ ఫొటో)

అయితే కమిషనర్ జారీ చేసిన ఆయా ఉత్తర్వుకు బ్రేక్ పడడమే అసలు విశేషం. కార్పొరేషన్ కు ఎన్నికలు తరుముకొస్తున్నవేళ.. ఇప్పుడు మున్సిపల్ జవాన్లను బదిలీ చేయడమేంటని, తమకు రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందని కొందరు తాజా మాజీ కార్పొరేటర్లు రాజకీయంగా ఒత్తిడి తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జవాన్ల బదిలీ ఉత్తర్వు సోమవారం నాటికీ కూడా అమలుకు నోచుకోలేదు.

ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో పాతుకుపోయిన మున్సిపల్ జవాన్లు సైతం ‘రాజకీయం’గా ప్రభావితం చేస్తారనే అంశం తాజా పరిణామంతో స్పష్టమైనట్లు నగరంలో తీవ్ర చర్చ జరుగుతోంది. పారిశుధ్య పనులు నిర్వహించే మున్సిపల్ జవాన్లను బదిలీ చేస్తే కొందరు తాజా మాజీ కార్పొరేటర్లకు రాజకీయంగా వచ్చే ఇబ్బంది, సమస్య ఏమిటో బోధపడడం లేదనేది ప్రజల్లో జరుగుతున్న ఆయా చర్చకు సంబంధించిన సారాంశం.

కాగా మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన జవాన్ల బదిలీ ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు..

Popular Articles