Top 5 This Week

Related Posts

ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపులపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్లకు చెల్లించాల్సిన మొత్తాలపై తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. రెండు విడతల్లో మంజూరు చేసిన సుమారు 8.00 లక్షల ఇండ్లకు రూ. 40,000 కోట్లకు పైగా మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. మొదటి విడతలో మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లకు సుమారు రూ.22,500 కోట్లు, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లకు సుమారు రూ.11 వేల కోట్లు, పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇళ్లకు సుమారు రూ.5,500 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.

భవిష్యత్తులో మూడో, నాలుగో విడతల్లోనూ అర్హులైన పేదలకు ఇళ్లు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. శాసనసభలో ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మేడిపల్లి సత్యం, అక్బరుద్దీన్, వెంకట్రామిరెడ్డి తదితరులు ఇందిరమ్మ ఇండ్ల బకాయిలపై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పొంగులేటి ఆయా ప్రకటన చేశారు.

మొదటి విడతలో ప్రభుత్వ అనుమతులతో ఇళ్లు ప్రారంభించి, నిర్మాణంలో చిన్నచిన్న లోపాల కారణంగా నిలిచిపోయిన సుమారు 3,200 ఇళ్లను రాటిఫై చేసి క్లియర్ చేశామని మంత్రి తెలిపారు. వారందరికీ ఈ వారం చివర్లోనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణంలో ప్రధానమైన సిమెంట్ ధరను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సిమెంట్ కంపెనీలతో చర్చలు జరిపినట్లు మంత్రి తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్లో రూ. 310–320 ఉన్న 50 కేజీల సిమెంట్ బ్యాగ్‌ను రూ. 230కే పేదలకు అందించేలా ఒప్పందం పూర్తి చేశామని, త్వరలో ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. స్టీల్‌ను కూడా తక్కువ ధరకు అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా దశాబ్దాలుగా గుడిసెల్లోనే జీవిస్తున్న పేదలకు రెండో విడతలో శుభవార్త అందిస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన సుమారు 59 వేల గుడిసెలను రెండో విడతలో ప్రాధాన్యతగా తీసుకుని ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Popular Articles