Top 5 This Week

Related Posts

సెక్రటేరియట్ వద్ద ఇద్దరు ‘లంచావతారులు’ అరెస్ట్

హైదరాబాద్: రూ. రెండు లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కోసం లక్ష రూపాయల లంచం స్వీకరిస్తూ ఇద్దరు వ్యక్తులు అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. తెలంగాణా సెక్రటేరియట్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆనందేశి రాఘవేందర్ ను, టీసీఐడీసీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మేడి వినోద్ ను ఈమేరకు ఏసీబీ అధికారులు గురువారం వలపన్ని పట్టుకున్నారు.

ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. మెడికల్ రీ-ఇంబర్స్మెంట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ కోసం బాధితుడు సీఎంఆర్ఎఫ్ మంజూరుకోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ. 2.00 లక్షల చెక్కు మంజూరు ప్రక్రియను నిర్వహించేందుకు ఫిర్యాదుదారుని నుంచి మేడి వినోద్, రాఘవేందర్ లు లంచంగా డిమాాండ్ చేశారు. ఈమేరకు రూ. 5,000 మొత్తాన్ని గతంలోనే ఫోన్ పే ద్వారా తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే లంచంగా డిమాండ్ చేసిన రూ. లక్ష మొత్తాన్నిరాఘవేందర్ స్వీకరించి, సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్ కు అప్పగించేందుకు తీసుకోగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచంగా స్వీకరించిన రూ. లక్ష మొత్తాన్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాఘవేందర్ నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో రాఘవేందర్ తోపాటు వినోద్ ను ఏసీబీ అధికారులు సెక్రటేరియట్ లోని టెంపుల్ వద్ద అరెస్ట్ చేశారు. నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Popular Articles