Top 5 This Week

Related Posts

కేసీఆర్ స్పీచ్ లో ‘బాధ, దుఃఖం’!

సారు గర్జిస్తారని గులాబీ కేడర్ ఆశించింది. ఓరుగల్లు సభలో పోరు హోరెత్తుతుందని పార్టీ కార్యకర్తలు అంచనా వేశారు. ఫాం హౌజ్ నుంచి బయలుదేరిన సారు సర్కారు సంగతేందో తేలుస్తరని భావించారు. నాయకులు, కార్యకర్తలు చెమటోడ్చి పార్టీ రజతోత్సవ సభకు జనసమీకరణ చేశారు. కానీ సారు గర్జనేదీ సభా వేదికపై వినిపించిన దాఖలాలు లేవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సారు స్పీచ్ లో ఆశించిన పంచ్ డైలాగుల్లేవ్! కానీ గంట సేపు ప్రసంగించారు. ఎల్కతుర్తి వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేవలం కేసీఆర్ మాత్రమే మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అరనిమిషం పాటు స్వాగతోపన్యాసం చేశారు. యావత్తు సభనుద్ధేశించి ఒకే ఒక్కడు.. కేసీఆర్ మాత్రమే మాట్లాడారు.

ఇంతకీ కేసీఆర్ ఏమంటున్నారంటే.. జననీ జన్మభూమిచ్ఛ.. అనే సూక్తి ప్రస్తావనతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తాను ప్రారంభించిన ఉద్యమ పార్టీ మఖలో పుట్టి, పుబ్బలో పోతుందన్నారని గుర్తు చేశారు. రాణీ రుద్రమ, బమ్మెర పోతన, సమ్మక్క సారలమ్మలను స్మరించారు. అమర వీరులకు శిరస్సు వంచి నివాళులర్పించారు. తొలిదశ ఉద్యమం స్తంభించిన తర్వాత మలిదశలో తెలంగాణా ఉద్యమానికి టీఆర్ఎస్ జీవం పోసిందన్నారు. గులాబీ జెండా ప్రస్థానాన్ని, ఉద్యమ సమయంలో గులాబీ పార్టీ లీడర్లు చేసిన త్యాగాలను గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పెదవులు మూశారే తప్ప, తెలంగాణా కోసం కొట్లాడలేదన్నారు. పదవులను త్యాగం చేసింది బీఆర్ఎస్ బిడ్డలేనని చెప్పారు.

పనిలో పనిగా చంద్రబాబును మళ్లీ గుర్తు చేశారు. సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణా పదాన్ని నిషేధించారని మళ్లీ చెప్పారు. స్పీకర్ తో రూలింగ్ ఇప్పించారని గుర్తు చేశారు. ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణాకు నంబవర్ వన్ విలన్ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. తెలంగాణాను ఆంధ్రాలో కలిపింది నెహ్రూ కాగా, 1969నాటి ఉద్యమంలో తెలంగాణా బిడ్డలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపిన ఘనత ఇందిరాగాంధీదేనని చెప్పారు. పధ్నాలుగేళ్లు ఏడిపించారన్నారు. కాంగ్రెస్ మెడలు వంచామన్నారు. ఆమరణ దీక్షకు దిగినట్లు చెప్పారు. తమ భయంకర పోరాటానికి భయపడిన కాంగ్రెస్ రాజకీయ అవసరం కోసం మాత్రమే, ఇష్టం లేకపోయినా, ఉద్యమ సుడిగాలికి తట్టుకోలేక తెలంగాణాను ఇచ్చిందన్నారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభ దృశ్యం

ప్రజలిచ్చిన అధికారాన్ని పదవులు అనుభవించడానికి తీసుకోలేదన్నారు. తెలంగాణాను ఎక్కడికో తీసుకుపోయామని చెప్పారు. పదేండ్ల పాలనలో అనేక రంగాల్లో ఎన్నో పనులు చేశామన్నారు. తలసరి ఆదాయాన్ని పెంచామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు చెప్పారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు అద్భుతమని చెప్పారు. తమ పాలనలో రైతుల కళ్లల్లో, కల్లాల్లో ఆనందాన్ని, ధాన్యరాశులను చూశామన్నారు. రైతాంగాన్ని కడుపులో పెట్టుకుని చూశామన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంథు పథకాన్ని తెచ్చామన్నారు. అద్భుత కరెంటు ఇచ్చామన్నారు. ఆంధ్రా వలసవాద సీఎంల నోళ్లు మూయించినట్లు చెప్పారు. రైతు బీమా, కళ్యాణలక్ష్మి వంటి పథకాలను అబ్బురపడే విధంగా అమలు చేశామన్నారు. ఐటీరంగంలో అద్భుత పురోగతి సాధించామన్నారు. రైతుల ధాన్యం కొన్న 3, 4 రోజులకే డబ్బు చెల్లించామన్నారు. శాంతి భద్రతలను కాపాడామన్నారు. ఏడాదిన్నర పాలనలోనే కాంగ్రెస్ కు ఏం మాయరోగం వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నెన్నో చెప్పారని, వాళ్ల కత చెప్పడానికి ముందు మన కథ చెప్పాలె కదా? అని అన్నారు. గోల్ మాల్ చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ ను మించినోళ్లు లేరన్నారు.

డూప్లికేట్ గాంధీలు ఢిల్లీ నుంచి వచ్చి చప్పట్లు కొట్టి డాన్సులు చేశారన్నారు. కాంగ్రెసోళ్ల నోటికే మొక్కాలని, 420 హామీలిచ్చారని, సిగ్గులేక ఊళ్లపంట తిరిగి బాండు పేపర్లు రాసిచ్చారని అన్నారు. తెలంగాణా దేవుళ్ల మీద ఒట్టు పెట్టారని, ప్రజలను ఏమార్చారని, ఉచిత బస్సులో దుడ్లు పట్టుకుని కొట్టుకుంటన్నరని అన్నారు. ఈ పథకం వల్ల ఎవనికీ ఉపయోగం లేదన్నారు. మాట్లాడితే బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై నిందలు వేస్తున్నారని, ఘోరంగా మోసం చేశారని, శానా సిపాయిలమని చెప్పారని, ఆశపడ్డామని, నమ్మి బోల్తా పడ్డామని, గల్లంతైనమని కేసీఆర్ అన్నారు. ఈరోజు తమనెవరూ నమ్మడం లేదని, అప్పు పుట్టడం లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, ఇంత మోసం ఉంటదా? ఎంత వరకు ఇది కరెక్ట్? ఎంత ఘోరం? ఫలితాన్ని చూస్తున్నం.. అని బీఆర్ఎస్ చీఫ్ అన్నారు. మొత్తంగా ‘మొగోడని మొల్క అల్కడానికి పిలిస్తే ఎల్క పిల్లను చూసి ఎల్లెల్కల పడ్డడట… అంటూ సామెతను చెప్పారు.

తన కండ్ల ముందటనే తెలంగానా ఇట్ల ఆగమైతుంటే మనసు శానా బాధైతాందని, దుఖఃం కలుగుతున్నదని కేసీఆర్ మథనపడ్డారు. భూముల ధరలు ఏడ బోయినయ్? అని ప్రశ్నించారు. కేసీఆర్ పక్కకు బోంగనే ఆగమైతదా? అని ప్రశ్నించారు. కరెంటు మీకెందుకు చాతనైతలేదు? అని కాంగ్రెస్ పాలకులను ప్రశ్నించారు. ఏం దౌర్భాగ్యం..? శని నెత్తమీద పెట్టుకున్నం.. అని అన్నారు. రాష్ట్రంలో 2014కు ముందున్న పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. హైడ్రా…వాని బొంద.. చెరువుల్లో పూడిక తియ్యడానికి మనం బుల్డోజర్లు వాడినం… పేదల ఇండ్లను కూల్చడానికి ఇప్పుడు బుల్డోజర్లను వాడుతున్నరు.. మౌనంగా ఉందామా? అని ప్రజలను ప్రశ్నించారు.

చివరి ఆరు నెలలు ఎలక్షన్ టైమేనని, ఇక రెండున్నరేళ్లే కాంగ్రెస్ కు ఉందన్నారు. పోగొట్టుకున్నచోటనే వెతుక్కోవాలని గులాబీ కేడర్ కు నిర్దేశించారు. అత్యవసరమైతే భూములు అమ్మవచ్చని, ఏ భూములు అమ్మాల్నో, మరే భూములను అమ్మకూడదో విచక్షణ ఉండాలన్నారు. యూనివర్సిటీ భూములను అమ్ముతరా? ప్రభుత్వాన్ని నడిపే విధానమా? అని ప్రశ్నించారు. తాను యాదగిరిగుట్టకు వెళ్లిన ప్రతి ట్రిప్పునకూ ఎకరానికి రూ. 10 లక్షల ధర పెరిగేదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిలైందన్నారు. ఆర్థికంగా దివాళా తీయించారని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారట. ఈ ప్రభంజనాన్ని ఎవడాపుతడు? అని అన్నారు.

పనిలో పనిగా పోలీసులకు హితోక్తి పలికారు. మీరెందుకు దున్కులాడుతున్నరు? మీకేం అక్కరొచ్చింది? ప్రశ్నిస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లపై కేసులు పెడ్తరా? పోలీసు మిత్రులారా.. మీ డైరీల్లో రాసుకోండి.. వందకు వంద శాతం బీఆర్ఎస్ మళ్లీ వస్తుంది. ఎవడూ అపలేడు. మీకు తెల్వదా? మీరు సదువుకోలేదా? మీరెందుకు బలైతరు? మీకు రాజకీయాలెందుకు? ఇక నుంచి కేసీఆర్ బయలుదేరుతడు… ఎందాకైనా.. అంటూ పోలీసులను సుతిమెత్తగా పరోక్షంగా హెచ్చరించారు.

ఈ ప్రభుత్వ అన్నింటా ఫెయిలైందని, దేంట్లోనూ పాస్ కాలేదన్నారు. సంచులు నింపుడు.. సంచులు మోసుడు.. ఇరవై, ముప్పయి శాతం కమీషన్లట. 200 మంది కాంట్రాక్టర్లు ఆర్థిక మంత్రి ఛాంబర్ ఎదుట ధర్నా చేసిండ్రు. ఈ అందానికి నన్ను అసెంబ్లీకి రమ్మంటున్నరు. పిల్లలడిగితేనే జవాబు చెపుతలేరు. అవివేకం..అజ్ఞానంతో వ్యవహరిస్తున్నారన వ్యాఖ్యానించారు. కత్తి వాని చేతిలో పెడితిరి.. యుద్ధం నన్ను చేయమంటిరి? బీఆర్ఎస్, కేసీఆర్ మీ వెంటే.. అంటూ సభా వేదికగా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో వివాదాస్పదమైన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వాన్ని మేమెందుకు పడగొడ్తంర భయ్..? బిడ్డా.. మీరే ఉండాలె.. సక్కగ పనిజేయకపోతే ప్రజలే మీ వీపులు పగులగొడ్తరు.. మేం ప్రభుత్వాన్ని పడగొట్టం.. అని కేసీఆర్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పీచ్ లో ఆసక్తికర అంశమేమిటంటే.. ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ కగార్ ను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. యువకులను, గిరిజనులను కగార్ పేరుతో ఊచకోత కోస్తున్నారని వ్యాఖ్యానించారు. బలమున్నదని సంపుకుంట పోవుడు కాదని, నక్సలైట్లను చర్చలకు పిలవాలని, వాళ్లేం మాట్లాడుతారో వినాలని, మిలట్రీ ఉందని కొడ్తరు కావచ్చు.. కానీ అది ప్రజాస్వామ్యం కాదు.. అని కేసీఆర్ అన్నారు.

.

Popular Articles