ఢిల్లీ: ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు అంశంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎంపీ తేజస్వీ సూర్య దేశ విభజనతో పోల్చడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈమేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఓ ప్రకటన విడుదల చేశారు.
బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వాన ప్రజలు అహింసా మార్గంలో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం యావత్ ప్రపంచానికి తెలిసిందేనని వద్దిరాజు గుర్తు చేశారు. ఈ వాస్తవాన్ని మర్చిపోయి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య దేశ విభజనతో తెలంగాణా ఏర్పాటును పోల్చడం అత్యంత దుర్మార్గమన్నారు.
దేశ అత్యున్నత చట్టసభలో కనీస అవగాహన లేకుండా మాట్లాడిన తేజస్వీ సూర్య వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించడమే రవిచంద్ర పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల్ని వెంటనే ఆయన వెనక్కి తీసుకోవాలని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు. ప్రజల ఓట్లతో ఎంపీలుగా ఎన్నికైన తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కర్నాటకకు చెందిన తేజస్వీ సూర్య చేసిన అసందర్భ, అసంబద్ధ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలని ఎంపీ వద్దిరాజు సూచించారు.

