Top 5 This Week

Related Posts

రెవెన్యూ ‘అవినీతి’పై ఏసీబీ దాడులు: మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: రెవెన్యూ శాఖకు చెందిన పలువురు అధికారులు అవినీతి కేసుల్లో ఏసీబీ వలకు చిక్కుతున్న పరిణామాలపై ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన రెండు రోజుల్లో రంగారెడ్డి జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కె. శ్రీనివాసులు, హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డిలు ఏసీబీ కేసుల్లో అరెస్టయిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకరుల ప్రశ్నలకు ఆయన స్పందించారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాాట్లాడుతూ, ఏసీబీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అని, వివిధ సెక్టార్ల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి, అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో తీసుకోవలసిన చర్యలపై ప్రభుత్వమే అవినీతిపై చర్యలకు పురమాయిస్తుందని చెప్పారు. ఇది తమ ప్రభుత్వ పాలనలో పారదర్శకతగా ఆయన చెప్పారు. రెవెన్యూ తన మంత్రిత్వ శాఖ కాబట్టి, ఎంత తప్పు చేసినా ఉపేక్షిస్తానని భావించడం పొరపాటన్నారు. ఇటువంటి అవినీతి ఘటనల్లో ఎంత పెద్దోళ్లు ఉన్నా చట్టం తన పని తాను చేసుకుపోవడంలో ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

అదేవిధంగా తన కుమారునిపై వచ్చిన ఆరోపణలు, వార్తలపై పొంగులేటి స్పందిస్తూ.. ‘సో.. ఇందాక నేను చెప్పాను కదా? ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనే భావనలో ఉన్నవారు మంత్రి కొడుకు మీద కేసు పెట్టించామనే వాక్కులు తప్పు. మేం ప్రభుత్వంలో ఉన్నపుడు పారదర్శకంగా వ్యవహిరిస్తున్నాం. ఒక మనిషి ఒక ఫిర్యాదు ఇచ్చినపుడు, ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం సహజం. రిజిస్టరే చేయవద్దని నేను అనగలుగుతాను. కానీ అలా అనే ఉద్ధేశం ఈ ప్రభుత్వానికి లేదు. కేసు రిజిస్టర్ అయిన తర్వాత తప్పకుండా దానిమీద అధికారులు నిజనిర్ధారణ చేసి, తప్పుంటే అందులో నా కొడుకు ఉన్నా, నేను ఉన్నా, ఇంకో వ్యక్తి ఉన్నా శిక్షకు అర్హుడు. తప్పులేకపోతే అవతల రాసినవాళ్ల గురించి నేనేం మాట్లాడను. వాళ్ల ఇంగితానికే వదిలేస్తా..’ అని పేర్కొన్నారు.

Popular Articles