Top 5 This Week

Related Posts

గుడ్ న్యూస్: బేతుపల్లి ఘటనలో గల్లంతైన పోలీసులు సేఫ్

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో గల్లంతైన వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురు మత్స్యకారులను రక్షించేందుకు నిన్న రాత్రి బేతుపల్లి చెరువులోకి దిగిన 11 మంది SDRF సిబ్బంది వరదనీటి ప్రవాహంలో గల్లంతైన సంగతి తెలిసిందే. గల్లంతైన మొత్తం 11 మందిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. అంతకు ముందే వరద నీటిలో చిక్కుకున్న ఐదుగురు మత్స్యకారులు సహా మొత్తం 16 మంది ఆచూకీపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. గల్లంతైనవారికోసం గత రాత్రి నుంచి ఈ తెల్లవారు జాము వరకు నిరంతర గాలింపు చర్యలు చేపట్టారు.

అదనపు SDRF సిబ్బంది బేతుపల్లికి చేరుకుని గల్లంతైనవారికోసం నిరంతర గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితంగా గత అర్ధరాత్రి వరకు నలుగురు సురక్షితంగా బయపటడగా, ఐదుగురి ఆచూకీ లభ్యమైంది. ఈ ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో గల్లంతైనవారిలో చివరి వ్యక్తి కూడా సురక్షితంగా బయపట్డారు. మొత్తం ఆరుగురు SDRF పోలీసులు, నలుగురు అగ్నిమాపక సిబ్బంది, చెరువులో దారి చూపేందుకు వారి వెంట గల మత్స్యకారుడు సహా మొత్తం 11 మంది వరద నీటి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

ఘటనా స్థలిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్

వీరేగాక అంతకు ముందు వరద నీటిలో చిక్కుకున్న ఐదుగురు మత్స్యకారులను కూడా ఎటువంటి హాని లేకుండా ఒడ్డుకు చేర్చగలిగారు. గల్లంతైన పోలీసులు సహా మొత్తం 16 మందిని సురక్షితంగా కాపాడడంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సహా పలువురు ఉన్నతాధికారులు రేయింబవళ్లు సత్తుపల్లిలోనే మకాం వేసి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గల్లంతైనవారిని రక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ, వారి పరిస్థితిపై వాకబు చేశారు. బేతుపల్లి ఘటనలో గల్లంతైన పోలీసులు సహా మొత్తం 16 మంది సురక్షితంగా బయటపడడంతో అధికార యంత్రాంగం సహా ఆయా శాఖల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Popular Articles