చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన ఇద్దరు ట్రెజరీ (కోశాగారం) అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. రిటైర్ట్ పంచాయతీ కార్యదర్శి ఒకరు తనకు రావలసిన పెండింగ్ వేతనం, పెన్షన్ బిల్లులను మంజూరు చేసేందుకు ట్రెజరీ అధికారులు అతని నుంచి లంచం డిామండ్ చేశారు.
ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ కథనం ప్రకారం.. దాదాపు నాలుగున్నరేళ్లపాటు సస్పెన్షన్ లో గల పంచాయతీ కార్యదర్శి ఒకరు తన ఉద్యోగం కోసం న్యాయస్థానంలో పోరాడారు. కోర్టు అతనికి అనుకూలంగా తీర్పునివ్వడంతో కలెక్టర్ ఉత్తర్వు మేరకు అతను తిరిగి విధుల్లో చేరారు. అయితే సస్పెన్షన్ పీరియడ్ లో తనకు రావలసిన వేతనం, ఇతర బిల్లులను క్లియర్ చేయించుకునేందుకు ట్రెజరీ విభాగాన్ని ఆశ్రయించారు. సస్పెన్షన్ పీరియడ్ కు సంబంధించి రూ. 23.00 లక్షల వేతనం, పెన్షన్ కు సంబంధించి రూ. 4.00 లక్షలకుపైగా బకాయిల గురించి బిల్లుల మంజూరు కోసం దరఖాస్తు చేశారు.

అయితే ఆయా మొత్తాలను మంజూరు చేసేందుకు పంచాయతీ కార్యదర్శి చేవెళ్ల ట్రెజరీ ఆఫీసును సంప్రదించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కె. అనూరాధ, సబ్ ట్రెజరీ అధికారి ఎం. లక్ష్మణ్ లు పంచాయతీ కార్యదర్శి నుంచి రూ. 2.50 లక్షల మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదని, ఇప్పుడు ఇచ్చుకోలేనని, తన బకాయిల వేతనపు, పెన్షన్ బిల్లులు మంజూరు కాగానే ఇస్తానని చెప్పారు. అయితే బిల్లులు పాస్ అయినప్పటికీ, అతని అకౌంట్ లో మాత్రం డబ్బు జమ కాలేదు.

దీంతో పంచాయతీ కార్యదర్శి ట్రెజరీ అధికారులను సంప్రదించగా, పార్ట్ పేమెంట్ గా కనీసం రూ. లక్ష ఇస్తే తప్ప ప్రయోజనం లేదని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే అసిస్టెంట్ ట్రెజరీ అధికారి అనూరాధ తాను ప్రయివేట్ గా నియమించుకున్న చిన్నా అలియాస్ జంగయ్య ద్వారా రూ. 50 వేలు, సబ్ ట్రెజరీ అధికారి లక్ష్మణ్ ద్వారా రూ. 50 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ట్రెజరీ అధికారులు అనూరాధ, లక్ష్మణ్ లతోపాటు ప్రయివేట్ వ్యక్తి జంగయ్యను కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.

