హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర సీఐ ఆంజనేయులును, ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గత అర్ధరాత్రి జరిగిన ఏసీబీ అధికారుల తనిఖీల్లో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
ఏసీబీ వర్గాల కథనం ప్రకారం.. ఓ కేసులో నిందితుడైన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు సీఐ రూ. 10.00 లక్షల మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే నిందితునితో సీఐ పనులు కూడా చేయించుకున్నాడు. బిర్యానీలు, కూల్ డ్రింక్స్ తీసుకురావాలని నిందితున్ని వేధించేవాడు. ఈ వేధింపులను తట్టుకోలేక నిందితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఇదే దశలో నిందితుని నుంచి డిమాండ్ చేసిన రూ. 10.00 లక్షల మొత్తాన్నిస్వీకరించే బాధ్యతను సీఐ ఆంజనేయులు ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డికి అప్పగించాడు. కీసర చెరువుగట్టు వద్ద గణేష్ నిమజ్జనం విధుల్లో గల ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డి కేసులో నిందితుడైన వ్యక్తి నుంచి రూ. 5.00 లక్షల మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. సీఐ ఆంజనేయుల్ని, ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

