Top 5 This Week

Related Posts

నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ అరెస్ట్

హైదరాబాద్: హైదరాబాద్ నిమ్స్ (నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) అదనపు మెడికల్ సూపరింటెండెంట్ నోరి లక్ష్మీ భాస్కర్ ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. లక్ష్మీ భాస్కర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, ఈ ఉదయం నుంచీ సోదాలు జరిపిన అనంతరం అతన్ని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.

తన సర్వీసు కాలంలో అవినీతి పద్ధతులు, అనుమానాస్పద మార్గాల ద్వారా తనకు తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు సంపాదించినందుకు గాను లక్ష్మీ భాస్కర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు ఏసీబీ ప్రకటించింది. ఈమేరకు లక్ష్మీ భాస్కర్ నివాసంలో, అతని బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సహచరులకు చెందిన మరో ఏడు ప్రదేశాలలో ఏసీబీ సోదాలు నిర్వహించింది.

ఈ సోదాల్లో హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలోని ఒక నాలుగు పడకగదుల ఫ్లాట్, కూకట్‌పల్లిలోని హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో రెండు మూడు పడకగదుల ఫ్లాట్లు, మణికొండ, పేటబషీరాబాద్, కూకట్‌పల్లిలోని ఐదు రెండు పడకగదుల ఫ్లాట్లు కనుగొన్నారు. అదేవిధంగా యాదాద్రి, నందిగామ, షామీర్‌పేటలోని నాలుగు ఖాళీ స్థలాలు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో ఒక 800 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని గుర్తించారు.

ఇవేగాక బ్యాంకులో రూ.41,00,000/- నిల్వలు, పోస్ట్ ఆఫీసులో రూ.12,00,000/- డిపాజిట్లు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలలో రూ.1,50,000/- పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 35,00,000/- నగదు, మ్యూచువల్ ఫండ్లలో రూ. 29,55,000/- పెట్టుబడులు, సుమారు 517.8 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

వీటితోపాటు ఒక్కోటి చొప్పున జాగ్వార్, ఆడి, టాటా నెక్సాన్ కంపెనీలకు చెందిన కార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్, వెస్పా, యాక్టివా, యమహా కంపెనీలకు చెందిన నాలుగు ద్విచక్ర వాహనాలు, రూ. 5,00,000/- విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయా ఆస్తుల మొత్తం విలువ రూ. 6,13,00,000/- గా పేర్కొన్నారు.

అయితే స్థిర, చరాస్తుల మార్కెట్ విలువ, పత్రాలలోని విలువ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండవచ్చుని ఏసీబీ తెలిపింది. ఓ అంచనా ప్రకారం వీటి విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 80.00 కోట్ల వరకు ఉంటుందనేది అనధికారికంగా ఏసీబీ వర్గాలు ఉటంకిస్తున్నాయి.

అంతేగాక డిఆర్‌టి ముందు వివాదంలో ఉన్న ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేయడానికి లక్ష్మీ భాస్కర్ రూ. 1,30,00,000/- పెట్టుబడి పెట్టినట్లు తెలిసిందని, వివిధ వ్యక్తులకు చేతివడ్డీగా మరో రూ. 1,33,00,000/- అప్పుగా ఇచ్చాడని ఏసీబీ తెలిపింది. అతని అదనపు ఆస్తుల తదుపరి ధృవీకరణ జరుగుతోందని, కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ వివరించింది.

Popular Articles